వంటావార్పుతో నిరసన

Dec 19,2023 20:50

ఆళ్లగడ్డలో వంటావార్పు చేపడుతూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

వంటావార్పుతో నిరసన
– 8వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె
– చాగలమర్రి, రుద్రవరంలో భిక్షాటన
– సున్నిపెంటలో రాస్తారోకో
– బనగానపల్లెలో ఎమ్మెల్యేకు వినతి అందజేత
ప్రజాశక్తి – విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె జిల్లాలో ఎనిమిదో రోజు మంగళవారం వినూత్న రీతిలో కొనసాగింది. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, ఆళ్లగడ్డ, కొత్తపల్లి, బండి ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, బనగానపల్లె తదితర మండల కేంద్రాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట వంటా వార్పు చేపట్టి నిరసన తెలియజేశారు. బనగానపల్లెలో తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అంగన్‌వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు వినతిపత్రం అందజేశారు. అలాగే సున్నిపెంటలో అంగన్‌వాడీలు రాస్తారోకో చేపట్టారు. చాగలమర్రి, రుద్రవరంలో అంగన్‌వాడీలు భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు.
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీలు వంట చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా కార్యదర్శి బాల వెంకట్‌, తాలుకా కార్యదర్శి రమేష్‌ బాబు తదితరులు అంగన్వాడీలకు మద్దతు తెలిపి మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేంద్రాల తాళాలు సచివాలయ సిబ్బందితో పగలగొట్టించడం దుర్మార్గమైన చర్య అన్నారు. అంగన్వాడీల న్యాయమైన 14 డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు రాజ్యలక్ష్మి, పెద్దక్క, వేణమ్మ, నరసమ్మ, భారతి, శశికళ, ముంతాజ్‌ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల రూరల్‌ : నంద్యాల పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు సమ్మెలో భాగంగా వంటావార్పు చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఒక వైపు చెప్తూనే మరో పక్క అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి సౌకర్యం కల్పించాలని, రాజకీయ, అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, పి.వెంకట లింగం, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మలమ్మ, ప్రాజెక్టు కార్యదర్శి సునీత, నాయకురాళ్లు నాగరాణి, ప్రసన్న, లలితమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు వంటావార్పు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా నాయకుడు పి దావీదు మాట్లాడారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

    రుద్రవరంలో భిక్షాటనతో అంగన్వాడీలు నిరసన రుద్రవరం : అంగన్వాడీల కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాయకురాలు మనోజ, బిబి, తిరుపాలమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు రుద్రవరంలోని అమ్మవారి శాల నాలుగు రోడ్ల కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నినాదాలు చేస్తూ బిక్షాటన చేశారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️