నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి: ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాయీ బ్రాహ్మణులు నేటికీ వెనుకబాటుకు గురికావడం బాధాకరమని, వారి అభ్యున్నతికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని శివనగర్‌ కాలనీలో టిడిపి నాయీ బ్రాహ్మణ సాధికార సమితి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘీయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల అభ్యున్నతికి అవసరమైన పథకాలను అమలు చేయించేందుకు అధిష్టానం దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తానని తెలిపారు. సంగీత కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు, సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తొలుత నాయీ బ్రాహ్మణులు మేళ తాళాలతో సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించి మద్దతు తెలియజేశారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పుటూరు బాల గురుస్వామి, టిడిపి జిల్లా సాధికార కమిటీ కన్వీనర్‌ పాలూరు సత్యం, సభ్యులు పిల్లుట్ల సుధాకర్‌, కొణిదల మోహన్‌రావు, పసుపుల శివరాం, రాయపాటి నాగరాజు, పథకమూరి రమేష్‌, ఈదర చిరంజీవి, ఈదర రవికుమార్‌, కనిగిరి నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాలూరి శివప్రసాద్‌, రాచర్ల వెంకటనారాయణ, చింతలపూడి వాసుదేవరావు, పచ్చవ చంద్రశేఖర్‌, చింతలపూడి తిరుపాలు, డి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️