ఎవరూ రాజీనామాలు చేయొద్దు..

Jun 19,2024 23:07

ఎమ్మెల్యే పుల్లారావుతో మాట్లాడుతున్న అంగన్వాడీలు, నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
అంగన్వాడీల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లేనిపోని అపోహలతో ఎవరూ తొందరపడి రాజీనామాలు చేయొద్దని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి అన్నారు. స్థానిక పండరీపురంలోని సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీల సమావేశం బుధవారం నిర్వహించారు. అంగన్వాడీలపై జిల్లా వ్యాప్తంగా వస్తున్న ఒత్తిళ్లపై మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇటువంటి ఒత్తిళ్లు సహజమేనని, వీటికే భయపడి రాజీనామాల వరకూ వెళ్లొద్దని చెప్పారు. ఇలాంటి సమయాల్లోనే ఐకమత్యంతో మెలగాలన్నారు. ఇంతకంటే ఎక్కువ ఒత్తిళ్లనే గతంలో అనేకం అధిగమించా మని, జీతాలు పెంచకపోవడం, యాప్‌లతో అధిక పని, ఇతర వేధింపులను పోరాటాల ద్వారా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. వీరికి సంఘీభావంగా కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడులతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, లేదా కార్మికులుగా గుర్తిస్తే ఈ సమస్యలు రావని అన్నారు. తప్పేమీ చేయకున్నా రాజకీయ కారణాలతో, ఇతర ఒత్తిళ్లతో అంగన్వాడీలను ఉన్నఫళంగా తొలగిస్తే వారి కుటుంబాలు ఏం కావాలని ప్రశ్నించారు. వైసిపి వాళ్లు అన్యాయం చేశారంటూ టిడిపి వారు సైతం అదే తరహాలో ప్రవర్తించడం సరికాదన్నారు. ఒత్తిళ్ల కారణంగా గతంలో వినుకొండలో అజంతాభారు ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భంలో ప్రజా సంఘాలు చూపిన ఐకమత్యాన్ని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును కలిసి సమస్యలపై విన్నవించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, అంగన్వాడి యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు జి.సావిత్రి పాల్గొన్నారు.

➡️