పలు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు

Apr 23,2024 21:44

నామినేషన్‌ దాఖలు చేస్తున్న పత్తిపాటి పుల్లారావు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి పట్టణలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఒ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రిటర్నింగ్‌ అధికారి బి.నారాధమునికి నామినేషన్‌ పత్రాలిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే హక్కు తనకే ఉందన్నారు. తన గెలుపైన కంటే మెజార్టీపైనా ఎక్కువగా ఆలోచిస్తున్నామని, రాష్ట్రంలోనే టాప్‌టెన్‌లో చిలకలూరిపేట మెజార్టీ ఉంటుందని అన్నారు.

నామినేషన్‌ దాఖలు చేస్తున్న వెంకట అప్పారావు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఐదో రోజైన మంగళవారం సత్తెనపల్లి అసెంబ్లీ స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.మురళీకృష్ణ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా ధూళిపాళ్లకు చెందిన బొర్రా వెంకట అప్పారావు నామినేషన్‌ దాఖలు చేశారు. బహుజన సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థిగా పేరిపోగు నవీన్‌బాబు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు తరుపున కళ్లం విజయభాస్కర్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మేకల వేణుమాధవ్‌రెడ్డి, నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన కందుకూరు జక్రీయా నామినేషన్‌ వేశారు. షేక్‌ దరియావలీ, మూడో సెట్‌ సూలం రాజ్యలక్ష్మి రెండో సెట్‌ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి గోదా వెంకట రమణ రెండోసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
ప్రజాశక్తి – వినుకొండ : వినకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళ వారం ఐదుగురు నామినేషన్లు సమర్పించినట్లు రిటర్నింగ్‌ అధికారి సుబ్బారావు తెలిపారు. ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెన్నా శ్రీనివాసరావు నామినేషన్‌ వేశారు. వినుకొండ పట్టణానికి చెందిన షేక్‌ బాజీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, బచ్చు వెంకట రవికుమార్‌ (ఆర్కే నాయుడు), నరాలశెట్టి శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థులుగా, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా చిరంజీవి నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.
ప్రజాశక్తి-మాచర్ల : మాచర్ల అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక తాహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు గోళ్ల శ్రీనివాసరావు, కుందూరు వీరాంజనేయరెడ్డి నామినేషన్‌ పత్రాలిచ్చారు.
నేటి నామినేషన్‌ వివరాలు
నరసరావుపేట
పార్లమెంట్‌ స్థానానికి వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ పి.అనీల్‌ కుమార్‌ యాదవ్‌, అసెంబ్లీ స్థానానికి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు పల్నాడు రోడ్డులోని రెడ్డినగర్‌ అభయ ఆంజనేయ స్వామి నుండి శ్రేణులతో ర్యాలీగా గడియార స్తంభం, మున్సిపల్‌ కార్యాలయం మీదుగా వెళ్లి పార్లమెంట్‌ అభ్యర్థి కలెక్టరేట్‌లో, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌డిఒ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రావిపాడు రోడ్డులోని ఆక్స్ఫర్డ్‌ స్కూల్‌ సమీపంలో, అల్లూరివారిపాలెం రోడ్డులోని నవ భారత స్కూల్‌ (ఓల్డ్‌) ఎదురు ప్రాంగణంలో, పెద్ద చెరువులోని కెబిఆర్‌ కళాశాలలో ప్రాంగణంలో, వినుకొండ రోడ్డులోని వి.వి.ఆర్‌ గ్రాండ్‌ పక్కన ప్రాంగణంలో, సత్తెనపల్లి రోడ్డు పెట్రోల్‌ బంక్‌ ఎదురు ప్రాంగణంలో శ్రేణులకు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వారి కార్యాలయాలు తెలిపాయి.
చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి ఇండియా బ్లాక్‌ తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎం.రాధాకృష్ణ బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా కృష్ణ మహల్‌ మీదుగా కళామందిర్‌ సెంటర్‌ నుంచి గడియార స్తంభం మీదుగా తహశీల్దార్‌ కార్యాలయం వరకు వెళ్తామని, 11.30-12 మధ్యలో నామినేషన్‌ దాఖలు చేస్తామని రాధాకృష్ణ తెలిపారు.
గురజాల నియోజకవర్గ వైసిపి అభ్యర్ధిగా కాసు మహేష్‌రెడ్డి రెండవసారి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పిడుగురాళ్ల నుండి ర్యాలీగా బయలుదేరి గురజాల వెళ్లి నామినేషన్‌ వేస్తామన్నారు.
వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్‌, శివయ్య స్తూపం సెంటర్‌ మీదగా తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందని జీవీ ఆంజనేయులు తెలిపారు.

➡️