హోరెత్తుతున్న ప్రచారం…

Apr 30,2024 22:16
  • ఓటర్లను ఆకట్టుకునే పనిలో వైసిపి, టిడిపి, సిపిఎం
  • వినూత్న రీతిలో సెంట్రల్‌లో ఇండియా వేదిక పార్టీల ప్రచారం
  • రెండు సార్లు నియోజకవర్గాన్ని చుట్టి వచ్చిన సిపిఎం అభ్యర్ధి
  • వైసిపి, టిడిపిలకు ధీటుగా సిపిఎం ప్రచారం
  • ఓటర్లను ఆలోచింప చేస్తున్న సిపిఎం అభ్యర్ధి ఎన్నికల ప్రసంగం

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో… వైసిపి, టిడిపి, సిపిఎంలు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని ఓటర్ల వద్దకు తీసుకెళ్తున్నాయి. ఈ మూడు పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్ధులు సైతం ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో సెంట్రల్‌ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో నువ్వా-నేనా అన్నట్లుగా వైసిపి, టిడిపి, సిపిఎం ప్రచారాన్ని నిర్వహిస్తూ రోజు రోజుకు ఎన్నికల హీట్‌ ఎక్కిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. డప్పు కళాకారులు, రోడ్‌ షో, బైక్‌ర్యాలీలు, ఇంటింటికీ కరపత్రాల పంపిణీ చేస్తూ వారి వారి అభ్యర్ధులకు ఓట్లు వేయాలని ఆపార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాయి. గ్రూపు మీటింగ్‌లు, విఐపిలతో సమావేశాలు, వాకర్స్‌తో మీటింగ్‌, ఆయా సామాజిక తరగతుల వారీగా ప్రత్యేక సమావేశాలు, ప్లెక్సీలు తదితర రూపాల్లో ఓటర్ల వద్దకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్తున్నాయి. అయితే ఈ సారి ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ అభ్యర్ధి చిగురుపాటి బాబూరావు, మిగిలిన వైసిపి, టిడిపి అభ్యర్ధుల ప్రచారానికి భిన్నంగా ప్రచారాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లే పనిలో ముమ్మరమయ్యారు. నియోజకవర్గాన్ని ఒకటికి, రెండు సార్లు డివిజన్ల వారీగా, ప్రాంతాల వారీగా, వీధి వీధికీ, ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం రోడ్‌ షో నిర్వహించిన సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహిస్తూ ప్రధాన సెంటర్లను కలుపుతూ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టి వచ్చారు. సింగ్‌నగర్‌లోని కాండ్రిక బస్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి ఉదయం ప్రారంభమైన ఈ రోడ్‌షో బైక్‌ ర్యాలీ కార్యక్రమం పైపుల రోడ్డు, డాబాకొట్లు సెంటర్‌, ప్లైఓవర్‌, సత్యనారాయణపురం, అలాగే అల్లూరి సీతారామరాజు బ్రిడ్జీ, దుర్గాపురం, గాంధీనగర్‌,అరండల్‌పేట, సూర్యారావుపేట, హనుమాన్‌పేట, కారల్‌ మార్క్స్‌ రోడ్డు, ఎంజి రోడ్డు తదితర ప్రధాన సెంటర్లను కలుపూతూ సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. సిపిఎం సెంట్రల్‌ అభ్యర్ధి చిగురుపాటి బాబూరావుతో పాటు విజయవాడ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి వల్లూరు భార్గవ్‌తో పాటు సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ఆద్మీలకు చెందిన నేతలు ప్రత్యేక వాహనంపై ఆసీనులై ప్రజలకు అభివాదం తెలుపుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. గడిచిన పది ఏళ్ల కాలంలో కేంద్రంలోని బిజెపి, అలాగే దానితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, అలాగే బిజెపికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న అధికార వైసిపి ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా విజయవాడ నగరానికి ఏఏ రూపాల్లో ఆపార్టీలు నష్టం కల్గించాయో వివరిస్తూ సిపిఎం అభ్యర్ధి బాబూరావు మాట్లాడుతున్న ప్రసంగా ఓటర్లలోకి తూటాల్లా పేలిపోతున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అంశంలో అధికార వైసిపి పాత్ర ఎంత ఉందో…అదే స్థాయిలో కేంద్రంలోని బిజెపి పాత్ర కూడా ఉందని, దీనిలో టిడిపి పాత్ర కూడా ఎంతో ఉందని బాబూరావు చేస్తున్న ప్రసంగం ఓటర్లలో ఆలోచింప చేస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్యాక్టరీని ప్రైవేటు వాళ్లకు తెగనమ్మడం, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దికి నిధులు కేటాయింపు, ప్రత్యేక విశ్వవిద్యాలయాల ఏర్పాటు తదితర ఎంతో విలువైన విషయాలను బాబూరావు ఓటర్లలోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అలాగే ప్రత్యేకించి బిజెపితో పాటు అధికార వైసిపి, టిడిపిల పాలనలో నిధులు, అధికారాల విషయంలో విజయవాడ నగరం ఏ విధంగా వివక్షకు గురైంది, అటు అభివృద్ది పరంగా వెనుకబడి ఉంది తదితర అంశాలను సరళమైన భాషలో అందరికీ అర్ధమయ్యే భాషలో మాట్లాడుతూ బాబూరావు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్ను, జిఎస్‌టి భారం, విద్యుత్‌ విభారాలతో పాటు గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఆకాశాన్నంటుతున్నాయో కరపత్రాల రూపంలో సమగ్ర సమాచారాన్ని ఓటర్ల వద్దకు సిపిఎం శ్రేణులు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ఆద్మీపార్టీల నేతలను కలుపుకొని సిపిఎం ప్రచారం చేయడంతో పాటు ప్రత్యేకించి, సిపిఎం గత రెండు మాసాల నుంచి వివిధ రూపాల్లో నియోజకవర్గం మొత్తాన్ని ప్రచారంలో తూర్పారపట్టినట్లు బాబూరావు, ఆపార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సిపిఎం, సిపిఐ గత రెండు దఫాలు కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న సమయములో ఈ నగరానికి చేసిన అభివృద్ది, సంక్షేమంతో పాటు ఆ తరువాత కూడా విఎంసిలో, అలాగే రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా విజయవాడ నగరాభివృద్దికి వామపక్షాలు నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాల తీరును బాబూరావుతోపాటు ఆపార్టీ నేతలు ఓటర్లలోకి తీసుకెళ్తు వినూత్న రీతిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలను ఆలోచింప చేస్తున్నారు. అలాగే ఆయా రంగాల్లోని ఉద్యోగ, కార్మికవర్గాన్ని ఎక్కడికక్కడ చైతన్యపరుస్తూ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని సిపిఎం, టిడిపి, వైసిపి కొనసాగిస్తున్నాయి.

➡️