పెచ్చులూడుతున్న ఆర్టీసీ బస్టాండ్‌

Apr 10,2024 22:01

ప్రజాశక్తి – మైలవరం : మైలవరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ శ్లాబు, బస్టాండ్‌కు రక్షణగా ఉన్న గోడల నుండి పెచ్చులూడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. సుమారు ఎకరం స్థలంలో 1985 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 87లో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ బస్టాండ్‌ నుండి విజయవాడ, గుంటూరు, భద్రాచలం, కొత్తగూడెం, నూజివీడు, తిరువూరు, మధిర తదితర ప్రాంతాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, 350, బస్సులు రోజుకు వందల సంఖ్యలో వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. మైలవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారంతా దూర ప్రయాణం చేయదలచినవారు మైలవరంలోని బస్టాండుకు చేరుకొని అక్కడినుండి తమ గమ్యస్థానాలకు వెళ్లే బస్సులో వెళ్తుంటారు. స్థానిక ప్రయాణికులే కాకుండా పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు కూడా బస్టాండ్‌కు చేరుకుంటారు. బస్సులు వచ్చే సమయానికంటే ముందుగా ప్రయాణికులు వచ్చి బస్టాండ్‌లో కూర్చుంటూ ఉంటారు. బస్టాండ్‌ నిర్మించి పాతికేళ్లు దాటింది. బస్టాండ్‌ శిథిలావస్థకు చేరుకుంది. దీంతో శ్లాబు పూర్తిగా ధ్వంసమై ఇనుప చువ్వలు బయటపడ్డాయి. వర్షాకాలంలో శ్లాబ్‌ నుండి నీరు కారటంతో బస్టాండ్‌ అంతా కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని గురవుతున్నారు. శ్లాబుపెచ్చులూడి పడటంతో ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది రాత్రి వేళల్లో బస్టాండ్‌లోనే నిద్రిస్తూ ఉంటారు. గతంలో పెచ్చులూడి పడటంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్‌కు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.

➡️