సజ్జల, ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు

Jun 25,2024 22:40 #badrinadh, #CID, #complaint

-రూ.550 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు మైనింగ్‌ దోపిడీ : బద్రీనాథ్‌
ప్రజాశక్తి -నెల్లూరు :నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగుపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో వైసిపి నాయకులు అదూరు శ్రీచరణ్‌, కృష్ణయ్యను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లో బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డి, డిఆర్‌ ఉత్తమ్‌ హోటల్‌ యజమాని కొడవలూరు ధనుంజరు రెడ్డి, సజ్జల భార్గవ్‌, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్‌లు అక్రమంగా మైనింగ్‌ దోచేశారని నెల్లూరు సిఐడి డిఎస్‌పికి ఆ ప్రాంత మైన్స్‌ యజమాని ఆదూరి బద్రీనాథ్‌ మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఎనిమిది మైనింగ్‌ క్వారీలను తన నుంచి బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. ఇందులో లక్ష నుంచి లక్షా యాబైవేల టన్నుల వరకు మైకా క్వార్జ్‌ను దోచేశారని ఆరోపించారు. సుమారుగా రూ.550 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. అక్రమ మైనింగ్‌కి పాల్పడిన బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి దేశం వదలి విదేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం స్పందించి ఆయన పాస్‌పోర్టును తక్షణమే రద్దు చేయాలని బద్రీనాథ్‌ కోరారు. బిరదవోలు శ్రీకాంత్‌తో పాటు కొడవలూరు దనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్‌, సందీప్‌లపై ప్రభుత్వం విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️