హయగ్రీవ భూముల వ్యవహారంలో.. మాజీ ఎంపి ఎంవివిపై కేసు

Jun 25,2024 22:46 #ex mp, #police case, #YCP, #YCP Leader

ప్రజాశక్తి – ఆరిలోవ (విశాఖపట్నం) :హయగ్రీవ భూముల వ్యవహారంలో విశాఖ మాజీ ఎంపి ఎంవివి.సత్యనారాయణ, ఆయన అనుచరుడు, ఆడిటర్‌ గన్మమనేని వెంకటేశ్వరరావు (జివి), పార్టనర్‌ గద్దె బ్రహ్మాజీలపై ఆరిలోవ పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు. ఆ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ భాగస్వామ్య సంస్థ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని సర్వే నెంబరు 92/3లో 12.51 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని 2008లో హయగ్రీవ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. పది శాతం భూమిలో అనాథశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, 90 శాతం భూమిలో వయో వృద్ధులకు గృహ నిర్మాణాలు చేసి విక్రయించే నిబంధనలతో అప్పట్లో భూ కేటాయింపు జరిగింది. సకాలంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలం కావడంతో రెవెన్యూ అధికారులు సంబంధిత స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై హయగ్రీవ సంస్థ కోర్టులో సవాలు చేసింది. మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయకుండా పనులను విస్మరించి 26 మంది ప్రయివేటు వ్యక్తులకు 32 వేల గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. దీంతో స్థల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ రిజిస్ట్రేషన్‌ శాఖ ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. అదే సమయంలో గత విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున హయగ్రీవకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని 2022లో ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో మాజీ ఎంపి ఎంవివి.సత్యనారాయణ, గన్నమనేని వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీలు హయగ్రీవ సంస్థ యజమానులైన చిరుకూరి జగదీశ్వరుడు, భాగస్వామి అయిన రాధారాణిలతో భవన నిర్మాణ ఒప్పందం చేసుకుందామని ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో రాజకీయ పలుకుబడితో భయపెట్టి బలవంతంగా ఖాళీ చేయించి తెల్లకాగితాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిపై సంతకాలు తీసుకొని మోసం చేశారని ఈ నెల 22న ఆరిలోవ పోలీసులకు సంస్థ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

➡️