హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై నిరసన

Jul 1,2024 22:55

ప్రజాశక్తి – కంచికచర్ల : కంచికచర్లలో హిట్‌ అండ్‌ రన్‌ కేసును రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో పలు ఆటో స్టాండ్‌ల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ న్యాయ సంహిత చట్టంను 2024 జూలై 1 నుండి అమలు చేయాలని నిర్ణయించిందని ఈ చట్టంలో ప్రమాదాలు జరిగి డ్రైవర్‌ హిట్‌ అండ్‌ రన్‌ అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించాలని రూపొందించటం దారుణమన్నారు. ఎన్నికల్లో మరోసారి గెలిచిన బి.జె.పి ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏక పక్షంగా నిర్ణయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి భూషణం, ఆటో యూనియన్‌ నాయకులు భగవాన్‌, శౌరి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.ఇబ్రహీంపట్నం : హిట్‌ అండ్‌ రన్‌ కేసును రద్దు చేయాలని కోరుతూ కొండపల్లి పారిశ్రామిక వాడలోని హెచ్‌.పిసిఎల్‌ చార్మినార్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. హాజరైన సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టంను వ్యతిరేకిస్తూ 2024 జనవరిలో దేశవ్యాప్తంగా రవాణా రంగంలో ఉన్న యజమానుల అసోసియేషన్లు డ్రైవర్లు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసాయన్నారు. సిఐటియు కార్యదర్శి యం మహేష్‌ హెచ్‌పిసిఎల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ (సిఐటియు) యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ సుందర్‌రావు, సెక్రటరీ పి.శేషగిరిరావు సభ్యులు రామకృష్ణ రమేష్‌ సాంబయ్య రాంబాబు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. నందిగామ : భారతీయ న్యాయ సాహిత్య చట్టం 2023 క్లాజు (106) (1) (2) లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నందిగామ సిఐటియు రాఘవాపురం ,కమ్మవారిపాలెం, గోళ్ళమూడి ఆటో స్టాండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కె. గోపాల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బాబు, అనీలు, రమేషు, సుబ్బారావు పాల్గొన్నారు.

➡️