మత్స్యకారభరోసా ఎప్పుడు ?

May 26,2024 21:16
  • సముద్రంలో వేట నిషేధం విధించి 40 రోజులు
  • ఇప్పటికీ అందని సాయం
  • 2,204 బోట్లకు సంబంధించి 12,813 మంది లబ్ధిదారులుగా గుర్తింపు !

ప్రతినిధిచేపల వేట నిషేధ భృతి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేట నిలిచిపోయి 40 రోజులు దాటినా ఇప్పటికీ మత్య్సకారులకు భృతి విడుదల కాలేదు. దీంతో రోజువారీ రెక్కాడితేగానీ డొక్కాడని మత్య్సకారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ప్రాధమికదశలో పూర్తయిన ఎన్యుమరేషన్‌ ఎన్‌రోల్‌మెంట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మత్య్సకారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక మండలాల పరిధిలో 101 కిలో మీటర్ల మేర సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. అత్యధిక సంఖ్యలోని తీర ప్రాంత గ్రామాల్లోని వేలాది మత్య్సకార కుటుంబాలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో మెకనైజ్డ్‌ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సముద్రంలో వేటకు వెళుతుంది. అలా వేటకు వెళ్లిన రోజుల్లో మత్స్యకారులకు ఒక్కొక్కరికి సగటున రూ.800 నుంచి రూ.1,200 వరకు ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో సముద్ర ఉత్పత్తుల వృద్ధికి ప్రతి ఏటా ఏప్రిల్‌ 15 అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 అర్థరాత్రి వరకు 61 రోజులపాటు ప్రభుత్వాలు సముద్రంలో వేటపై నిషేధం విధించాయి. ఈ నిషేధం కారణంగా ఉపాధి కోల్పోతున్న మత్య్సకార కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ మత్య్సకార భరోసా అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఈ సీజన్లో ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో సంబంధిత లబ్ధిదారులకు పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వేట ద్వారా జీవనం సాగించే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాధమిక నివేదికలోనూ అవకతవకలు ?వేట నిషేధం కారణంగా భృతి కోల్పోయిన మత్య్సకార్మికులను మత్య్సశాఖ జిల్లా యంత్రాంగం గుర్తించి వారి పేర్లను నమోదు చేయాలి. దీనికి సంబంధించి ప్రాధమిక దశ నివేదికను అధికారులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 2,204 బోట్లకు సంబంధించి 12,813 మందికి మత్య్సకార భరోసా ఇవ్వాల్సి ఉంటుందని నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. ఈనివేదికను సచివాలయాల్లో ప్రదర్శించి సోషల్‌ ఆడిట్‌ పూర్తయిన తర్వాత తుది నివేదిక ఆధారంగా భృతి కోల్పోయిన వారికి భరోసా చెల్లిస్తారు. అయితే ప్రాధమిక దశలోనే భరోసా ఎన్యుమరేషన్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా వేటకు వెళ్లే మత్య్సకారులను పక్కనపెట్టి బోటు యజమానులు చెప్పిన వారి పేర్లు నమోదు చేశారని తీర ప్రాంత గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఒక్కో బోటుకు బోటు యజమానుల బంధువులు, కుటుంబ సభ్యులు పేర్లు మూడు, మిగిలిన మూడు పేర్లు వారికి అనుకూలంగా ఉన్న మత్య్సకార్మికుల పేర్లను నమోదు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో అర్హులైన అందరికీ త్వరగా మత్య్సకార భరోసా ఇవ్వాలని వాస్తవ మత్య్సకార్మికులు కోరుతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోందివాటపల్లి నాంచారయ్య, గిలకలదిండి, మచిలీపట్నం మండలంవేటకు వెళితేనే మా కుటుంబానికి పూటగడుస్తుంది. 40 రోజులుగా వేట నిలిచిపోయింది. ప్రభుత్వం ఇచ్చే భరోసా రూ.10 వేలు ఇవ్వలేదు. రోజువారీ కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. మత్య్సకార భరోసా విడుదల చేయాలిపి.చక్రవర్తి, ఏటిపవర్‌, కృత్తివెన్ను మండలంమత్స్సకారుల కుటుంబాలకు వేటే ఆధారం. వేట నిలిచిపోయిన వెంటనే ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయం కుటుంబాల పోషణకు ఉపయోగపడుతుంది. అయితే మత్స్యకార భోరోసా విడుదలలో జాప్యం జరగడంతో అవస్థలు పడుతున్నాం. వెంటనే వైఎస్‌ఆర్‌ మత్య్సకార భరోసా విడుదల చేయాలి.అర్హులందరికీ ఇవ్వాలికొప్పనాతి తాతయ్య, ఎపి మత్య్సకారులు, మత్య్సకార్మిక సంఘం జిల్లా బాధ్యులువైఎస్‌ఆర్‌ మత్య్సకార భరోసా ఎన్యుమరేషన్లో అవకతవకలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్ర వేటకు వెళ్లే మత్య్స కార్మికులందరి పేర్లను జాబితాలో నమోదు చేయాలి. అర్హలందరికీ భృతి చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి.

➡️