వడదెబ్బకు ముగ్గురు మృతి

Apr 30,2024 14:54 #Old man died, #sunburn

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వడదెబ్బకు మంగళవారం ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఒకరు ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడకు చెందిన రామారావు (68) పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎండకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలాల మధ్యనే పడిపోవడంతో స్థానికులు గుర్తించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన బలరాం (85) గ్రామ సమీపంలోని తన చిన్న కుమారుడి వద్దకు వెళ్తుండగా వడదెబ్బకు గురై అక్కడే మృతి చెందారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన అక్కయ్య (70) మైదుకూరులో జరిగిన జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు వెళ్లారు. ఇంటికి వచ్చిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం చెన్నూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

➡️