ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ప్రచార మోత

May 3,2024 22:27

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భగభగ మండుతున్న భానుడు ప్రతాపానికి చిన్నా, పెద్దా వృద్ధులు ప్రతి ఒక్కరూ అవస్థ పడుతున్నారు. అవసరమేమైనా ఉండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక మనుషులతో పాటు పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. ఎండదెబ్బ బారిన పడేలా చేస్తోంది. ఎన్నికల ముంగిట ఎండ తీవ్రత సాధారణ ప్రజానీకంతోపాటు రాజకీయ పార్టీలకూ తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు ఎండవేడిమి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో అభ్యర్థులు కాస్త దైర్యం చేస్తున్నా వారి వెంట వెళ్లేందుకు కార్యకర్తలు జంకుతున్నారు. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఏకంగా 42 నుండి 45 డిగ్రీలపైనే నమోదు కావస్తుండటం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరో 9 రోజులలో పోలింగ్‌ జరగనుండగా అధిక ఉష్ణోగ్రతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు విజయమే లక్ష్యంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకు సైతం ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. ఓ వైపు ఎండవేడి మరోవైపు ఎన్నికల వేడితో రాజకీయ పార్టీల నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి ప్రచారం చేయడం పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆయా పార్టీల నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 13న పోలింగ్‌ జరుగనుండటం ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంత తక్కువ వ్యవధిలో పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించగలమా అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది. గత నెలలో కేవలం మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం కొన్ని రోజలు నుంచి పల్లెలు, వార్డులకు చేరడం, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సవాలుగా మారుతోంది.
భయపడుతున్న కార్యకర్తలు…
ఎండవేడిమి ఉక్కపోత తీవ్రస్థాయిలో ఉన్నా అభ్యర్థులు తప్పనిసరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారివెంట వచ్చే శ్రేణులు మాత్రం మధ్యలోనే ఆగిపోతున్నారు. కొందరు కార్యకర్తలైతే ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ఎన్నికలు ఏమో గాని ప్రచారం ప్రాణాల మీదకు వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో అభ్యర్థులు, వారి తరపున ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు ఉదయాన్నే ఆయా పల్లెలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారంలో నిమగమవుతున్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట:నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండ వల్ల రహదార్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అయినా భవన నిర్మాణ కార్మికులు, రిక్షాకార్మికులు, ఇతర కూలీలు తమ జీవనాధారం కోసం ఎండలోనూ మలమల మాడుతూ చెమట చిందించక తప్పడం లేదు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోవడానికీ అవస్థ పడుతున్నారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటలకు ప్రచారాన్ని పరిమితం చేసుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి : డాక్టర్‌ కొల్లా అమర్‌
వీలున్నంత వరకు ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు టోపీ, లేదా ఏదైనా వస్త్రాన్ని కప్పుకోవాలి. రోజుకు కనీసం ఐదారు లీటర్ల నీటిని తాగాలి. ఎక్కువగా చెరుకురసం, కొబ్బరినీరు, జావ, తాటి ముంజలు, గ్లూకోజ్‌ వాటర్‌, నిమ్మ నీళ్లు, ఓఆర్‌ఎస్‌, మజ్జిగ తీసుకుంటే మంచిది. మసాలాలు, నూనె ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. వీటితో కూడిన ఆహారం ఒక్కోసారి ప్రమాదానికి దారితీయొచ్చు. చల్లదనం కోసమని ఫ్రిజ్‌లో నీరు తీసుకోకూడదు. తల తిరుగుడు, నీరసం, విరోచనాలు వంటి లక్షణాలుంటే డాక్టర్ల సలహాల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.

➡️