కౌంటింగ్‌ ప్రతినిధులతో పల్నాడు జిల్లా కలెక్టర్‌ సమావేశం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తమ అనుచరగణం ఎలాంటి వివాదాలకు పోకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్‌ బి లత్కర్‌ బాలాజీరావు సూచించారు. బుధవారం నరసరావుపేట కలెక్టరేట్‌ లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రధాన పార్టీలు వారి వారి ఏజెంట్లను నియమాకానికై ఫామ్‌- 18 ల ద్వారా రెండు సేట్లను త్వరితగతిని అందించాలన్నారు. ఒక సెట్‌ ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కి పంపించి ఎన్టిసీడెన్సును విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి కేసులు లేని వారిని మాత్రమే ఏజెంట్‌గా నియమించడం జరుగుతుందన్నారు. నరసరావుపేట మండలంలోని జె.ఎన్‌.టి.యు కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని 100 మీటర్లలోపు ఎవరి వాహనాలకు అనుమతులు లేవని తెలిపారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. కళాశాల ప్రధాన గేటు వద్ద 24 గంటలు పనిచేసే విధంగా పెద్ద స్క్రీను ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని స్ట్రాంగ్‌ రూమ్‌ ల నుంచి సిసి కెమెరాల సర్వైలెన్స్‌ ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు పోస్టల్‌ బ్యాలెట్లు 3 రకాలు ఉన్నాయని ఒకటి ఉద్యోగస్తులది రెండవది హౌమ్‌ ఓటింగ్‌ 3 సర్వీస్‌ ఓటర్లని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్లు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి పోలీస్‌ స్టేషన్లో, చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌ లో, నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ట్రెజరీలో, సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి సంబంధిత రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అధీనంలో మరియు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి వినుకొండ ట్రెజరీలో గురజాల నియోజకవర్గం సంబంధించి పోలీస్‌ స్టేషన్‌ లో అదేవిధంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పోలీస్‌ స్టేషన్లో భద్రపరచడం జరిగిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లన్నిటిని జూన్‌ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ జేఎన్టీయూ కళాశాలకౌంటింగ్‌ సెంటర్‌ కు తరలించడం జరుగుతుందన్నారు. రానున్న 2 రోజులలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలవుతుందని అదేవిధంగా ఈవీఎంల కౌంటింగ్‌ కూడా మొదలవుతుందని తెలిపారు. ఈవీఎం కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్లమెంట్‌ నియోజకవర్గానికి 14 టేబుల్‌ ల చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ కు అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున టేబుల్‌ లు మాచర్ల నియోజకవర్గానికి మూడు సత్తెనపల్లి నియోజకవర్గానికి మూడు టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కు 18 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ అనంతరం వెలువడిన ఫలితాలపై ప్రజా తీర్పును గౌరవించి ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

➡️