అందుబాటులోకి పెదగదిలి బ్రిడ్జి రహదారి

May 11,2024 23:49 #bridge road, #pedagadili
pedagadili, bridge, road

 ప్రజాశక్తి – ఆరిలోవ : బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఆరిలోవ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో చేపట్టిన వంతెన ఎత్తు, విస్తరణ పనులు పూర్తయ్యాయి. సుమారు మూడు నెలల్లోనే అందుబాటులోకి రావడంతో ఆరిలోవ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. దీంతో ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదు లైన్ల బిఆర్‌టిఎస్‌లో పెదగదిలి కూడలి నుంచి తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మీదుగా తోటగరువు వరకు వెడల్పయిన రోడ్డు ఉంది. ఈ రెండింటి మధ్య ఒక ప్రధాన గెడ్డపై ఇరుకైన 30 అడుగుల లోతుగా ఉండే వంతెన ఉండేది. బ్రిడ్జి లోతుగాను, ఇరుకుగా ఉండడంతో వర్షాకాలంలో గెడ్డ పొంగడం, నీరు నిల్వ ఉండిపోయేది. ఈ సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉండడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఇటీవల మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి చొరవ తీసుకొని సుమారు రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు 80 అడుగుల విస్తీర్ణంలో వంతెన రహదారి పనులు పూర్తి చేశారు. తోటగరువు నుంచి ఆరిలోవ అంబేద్కర్‌ విగ్రహం వరకు రెండు వరుసల రహదారి విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇదీ పూర్తయితే ఆరిలోవ ప్రజలకు చాలా వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

➡️