పెమ్మసాని చంద్రశేఖర్‌ ఒక వలస పక్షి

May 7,2024 00:47

మాట్లాడుతున్న జంగాల అజరుకుమార్‌
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలోని ఉప్పల పాడు పక్షుల కేంద్రానికి అనేక ప్రాంతాల నుండి పక్షులు వలస వస్తూ ఉంటాయని, అక్కడ కొన్ని రోజులు సేద తీరి వెళ్లిపోతుంటాయని, అలాగే గుంటూరు పార్లమెంట్‌కు టిడిపి తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా ఒక వసల పక్షితో సమానం అని ఇండియా వేదిక గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ అన్నారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంపై పెద్ద చర్చ జరుగుతుందని, పెద్ద మొత్తంలో ధనం వెచ్చించి ఒక ఎన్‌ఆర్‌ఐ ఇక్కడ ఎంపిగా గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే కనబడడు, వినబడడు అని, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈయన కనీసం ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన సద్దాం హుస్సేన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని తెలియచేస్తుందన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉండేది, ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రత్యేక హౌదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీకి టిడిపి, వైసిపి మద్దతు ఇస్తున్నాయన్నారు. పెమ్మసాని, రోశయ్య గెలుపు అంటే అది మోదీకే ఉపయోగం అన్నారు. కావున కంకికొడవలి గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కె.మాల్యాద్రి, నాయకులు హనుమంతరావు, ఎ.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️