మైనింగ్‌కు అనుమతులేవి?

Apr 16,2024 21:56

కాసులకు కక్కుర్తి పడి చర్యలు తీసుకొని అధికారులు

ప్రజాశక్తి – వేపాడ  : మండలంలోని వీలుపర్తి పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబరు 4,5లలో ఏ విధమైన అనుమతులూ లేకుండా అక్రమ మైనింగ్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాయకుడు ఇష్టానుసారంగా తవ్వకాలు చేసి కాసులును పోగేసుకుంటూ ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారు. భారీ పేలుళ్ల కారణంగా పరిసర ప్రాంతాలలో ఉన్న బొర్రావలస, కొలుకు పాలెం గ్రామాల్లో గిరిజనుల ఇళ్లు బీటలు వారి పోతున్నాయి. పేలుళ్లు వల్ల వచ్చే దూళి కారణంగా రోగాలు బారిన పడుతున్నారు. భయంకరమైన శబ్ధాలతో పేలుళ్లకు శబ్ధ కాలుష్యానికి గురువుతున్నారు. ఈ దూలి వల్ల పంటలు కూడా పాడైపోతున్నాయి. మరో పక్క ప్రజలు రోగాల భారిన పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేస్తే ఆమె ఆదేశాలు మేరకు క్షేత్ర స్థాయిలోకి వచ్చిన అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి అధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని చెబుతున్నారు. పరిశీలనకు వచ్చిన అధికారులు ఫిర్యాదు దారుల సమక్షంలో దర్యాప్తు చేయకుండా కాసులకు కక్కుర్తి పడి తూతూ మంత్రంగా చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్రమ మైనింగ్‌పై దృష్టి పెట్టి దర్యాప్తు చేసి గిరిజన ప్రజలకు ప్రాణహాని జరగకుండా తగు చర్యలు చేపట్టాలని గిరిజనులు వి.గౌరినాయుడు, పోతుబంది కన్నయ్య దొర, శ్రీను, సీతారాం, వి మహేష్‌, అప్పలరాజు, నూకరత్నం కోరుతున్నారు.

➡️