రంపచోడవరంలో పోలింగ్‌ ప్రశాంతం

విఆర్‌.పురం మండలం, శ్రీరామగిరికి ఓటు వేసేందుకు గోదారిలో బోటుపై వస్తున్న కల్తునూరు గ్రామస్తులు

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలు చోట్ల ఈవిఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. రంపచోడవరం : రంపచోడవరం నియోజకర్గంలోని 399 పోలింగ్‌ కేంద్రాల్లో సుమారు 232 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అందులో 10 అత్యంత సమస్యాత్మకమైనవి ఉండగా, వీటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రంపచోడవరం పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వై.రామవరం మండలం ఎగువ గుర్తేడు, పాతకోట, బొడ్డగండి పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి హెలీకాప్టర్‌ ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌కు సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చారు. విఆర్‌.పురం మండలంలోని తుమ్ములేరు పోలింగ్‌ కేంద్రం నుండి పడవలో ప్రయాణం చేసి ఎన్నికల సామాగ్రి తీసుకురావడం జరిగింది. మండల కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ప్రశాంత్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, బాబు రమేష్‌, మాజీ రాజ్యసభ సభ్యురాలు టి.రత్నాబాయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రంపచోడవరం అడిషనల్‌ ఎస్పీ జగదీష్‌ హెచ్‌. పర్యవేక్షించి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచే విధంగా ఎన్నికల పరిశీలకులు పంకజ్‌ సింగ్‌, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, రిటర్నింగ్‌ అధికారి యస్‌. ప్రశాంత్‌ కుమార్‌, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య, పర్యవేక్షించారు. ఎన్నికలు సజావుగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నరు. నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిఉదయం 7 నుండి 9 గంటల వరకు 7.61శాతం, 9 నుండి 11 గంటల వరకు 23.06 శాతం, 11 నుండి ఒంటి గంట వరకు 34.43 శాతం, ఒంటి గంట నుండి 3 గంటల వరకు 54.11 శాతం, మూడు గంటల నుండి 7 గంటల వరకు 66.32 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.చింతూరు : చింతూరు మండలంలో మొత్తం 30,313 మంది ఓటర్లు ఉండగా, మొత్తం 40 పోలింగ్‌ బూత్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్‌ ప్రారంభమవుతుందని ఓటర్లు తెల్లవారుజాము నుండే స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్నారు. అయితే ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటన్నర పాటు క్యూ లైన్‌లో నొల్చొని ఇబ్బందులకు గురయ్యారు. 347, 348 పోలింగ్‌ బూత్లలో భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలో నిలవడంతో కొంతమంది విసుగు చెంది ఓటు వేయకుండానే వెనుతిరిగారు. ఈవీఎంలు మోరాయించిన కారణంగా ఓటింగ్‌ శాతం మందకోడిగా సాగడంతో సాయంత్రానికి 59.80శాతం పోలింగ్‌ నమోదైంది. చింతూరు ఎఎస్పి రాహుల్‌ మీనా ఎన్నికల తీరును పరిశీలించారు. ఎస్సై శ్రీనివాస్‌ కుమార్‌ తన సిబ్బందితో ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు.దేవీపట్నం : దేవీపట్నం మండలంలోని పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఇందుకూరుపేట, ఇందుకూరు, కమలంపాలెంలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. గోకవరం పరిసర ప్రాంత పోలవరం నిర్వాసితులు ఇందుకూరుపేటలో ఓటు వేశారు. మారుమూల ప్రాంతమైన ఎర్రమెట్ల, పెద్ద నోతులు పావుగండి గ్రామాల్లో అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. మారేడుమిల్లి : మండలంలో సోమవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా, మండలంలో కొన్ని బూతుల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. మారేడుమిల్లి, కుట్రవాడ, లోతట్టు బూతులలో ఈవీఎంలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. మారేడుమిల్లిలో ఓటర్లు ఉదయం నుండి పోలింగ్‌ బూత్‌ వద్ద బారులు తీశారు. క్యూలైన్లో నిలుచున్న కొంతమంది ఎండ వేడిమికి తట్టుకోలేక వెనుతిరిగారు. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు వద్దకు అధిక సంఖ్యలో ఓటర్లు చేరుకోగా నాలుగు గంటలకు ముగించాల్సిన పోలింగ్‌ 5 గంటల వరకు సాగింది. మండల తహశీల్దారు వెంకటరమణ, ఎస్సై రాము ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.విఆర్‌.పురం : మండలం మొత్తం 80శాతం పోలింగ్‌ నమోదైంది. గిరిజన ప్రాంత మండలాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్‌ సమయం నిర్ణయించడంతో కొంతమంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోయామని వాపోయారు. మండలంలోని శ్రీరామగిరి, చిన్నమట్టపల్లి గ్రామాలలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో ప్రజలు క్యూ లైన్‌ల్లో గంటల తరబడి నిలబడవలసి వచ్చింది. ముంపు ప్రాంతం కొల్లూరు, గొందూరు కల్తునూర్‌ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణించి తుమ్మిలేరు, శ్రీరామగిరిలోని పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం విశేషం.రాజవొమ్మంగి : మండలంలోని రాజవొమ్మంగి, అనంతగిరి పోలింగ్‌ బూతుల్లో ఈవీఎంలు పనిచేయక ఓటర్లు గంటల తరబడి క్యూలో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓటర్‌ స్లిప్పులు అందక, ఏ బూత్‌లో ఓటు వేయాలో తెలియక చాలామంది ఓటు వేయకుండా వెనుదిరిగారు. రాజవొమ్మంగి 75వ బూత్‌లో ఈవీఎం ప్యాడ్‌ను మార్చారు. మండలంలోని లబ్బర్తి గ్రామంలో సమయం అయినప్పటికీ చాలా మంది ఓటర్లు క్యూలో ఉండడంతో సాయంత్రం 6.30 తరువాత కూడా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా మండలంలోని 65శాతం పోలింగ్‌ నమోదైంది. మండలంలోని జట్టంగి పోలింగ్‌ బూత్‌ వద్ద ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో బాటు వైసిపి నాయకులు రావడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. నాయకులకు ప్రవేశం లేదని ఘర్షణ పడ్డారు. అధికారులు ఇరువురిని సమదాయించారు.కూనవరం : మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.16595 మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.50 పోలింగ్‌ శాతం నమోదైంది.ఎటపాక : మండలంలోని చాలాచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది. ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌లకు వచ్చినవారు ఈవిఎంలు మొరాయించడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలింగ్‌ ప్రారంభమయ్యే సరికి క్యూలైన్లలో ఓటర్లు బార్లు తీరారు. పోలింగ్‌ మందకొడుగా జరుగుతుండడంతో పోలింగ్‌ సిబ్బందితో ఓటర్లు వాగ్వివాదానికి దిగారు. సరైన సౌకర్యాలు లేక మండుటెండలో నిలబడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలో42 బూత్‌ల్లో 33,409 ఓటర్లు ఉండగా 25,562 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.51 శాతం ఓటింగ్‌ నమోదైంది. అడ్డతీగల : మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. మండలంలో మొత్తం 32,458 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం నాలుగు గంటలకు 19 953 ఓట్లు పోలైనట్లు తహశీల్దారు నాగమణి తెలిపారు. ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ 8:45 గంటలకు ప్రారంభమైంది. వేటమామిడి పంచాయతీ పలుకురాతిపాలెం గ్రామంలో 18 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం పూర్తిగా మొరాయించడంతో ఆ ఈవీఎంను మార్చడం జరిగింది. ధాన్యం పాలెం పంచాయతీ పెద్ద ములకలగడ్డ గ్రామంలో ఉదయం 9.45 గంటలకు కూడా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. దీంతో అధికారులు ఇవిఎంను, సిబ్బందిని మార్చడం జరిగింది. డి.భీమవరం పంచాయతీ నిమ్మలపాలెం గ్రామంలో ఈవీఎం మోరాయించడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఇవిఎంల మోరించడం కారణంగా కొత్తూరు ధాన్యం పాలెం పోలింగ్‌ బూతుల్లో రాత్రి 8.30 గంటలకు కూడా పోలింగ్‌ కొనసాగుతుంది. వై.రామవరం : మండలంలోని 22,231 మంది ఓటర్లు ఉండగా, 13714 ఓట్లు నమోదయ్యాయి. 55శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️