మందకొడిగా పోలింగ్‌

May 14,2024 00:45 #poling
poling

ప్రజాశక్తి -యంత్రాంగం చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం విశాఖ నగరంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, మరికొన్ని చోట్ల వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల పోలింగ్‌ మందకొడిగా సాగింది. భీమునిపట్నం : జివిఎంసి ఒకటో వార్డు జెడ్‌పి బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, చిట్టివలస జివిఎంసి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ హైస్కూల్‌ వద్ద ఏర్పాటుచేసిన 146, 147, 153, 155, 148 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరారు. 155వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. వృద్ధులు గంటల తరబడి నిల్చోవడానికి ఇబ్బందిపడ్డారు. జివిఎంసి మూడో వార్డు పరిధిలోని భీమిలి సిబిఎం, సెయింట్‌ ఆన్స్‌ ప్రాథమిక పాఠశాలల వద్ద, ఎంఎఫ్‌సి యుపి, ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల వద్ద ఏర్పాటుచేసిన 174, 175, 176, 181, 183, 186, 187 పోలింగ్‌ కేంద్రాల వద్ద చాంతాడులా ఓటర్లు క్యూ లైన్‌లో నిలబడ్డారు. పోలింగ్‌ మందకొడిగా సాగింది. క్యూలైన్‌లో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. భీమిలి మండలం రేఖవానిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన 160 పోలింగ్‌ కేంద్రం వద్ద ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ మందకొడిగా సాగింది. జెడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో 147 నంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎండలోనే ఓటర్లు క్యూలైన్‌లో నిలబడి ఇబ్బంది పడ్డారు. జివిఎంసి మూడో వార్డు పరిధి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన 183 పోలింగ్‌ కేంద్రం, ఎంఎఫ్‌సి యుపి పాఠశాలల వద్ద 186, 187 పోలింగ్‌ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో షామియానాలు లేక పోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఎంఎఫ్‌సి యు పి పాఠశాల వద్దకు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్‌ రమణమ్మకు ఫిట్స్‌ రావడంతో పడిపోయింది. ఆశా వర్కర్‌, హెల్త్‌ వర్కర్‌ సపర్యలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు తాగు నీటి సదుపాయం కల్పించినప్పటికీ వందల సంఖ్యలో వచ్చిన ఓటర్లకు క్యాన్ల ద్వారా ఏర్పాటుచేసిన తాగు నీరు ఎటూ చాలలేదు. దీంతో ఎంఎఫ్‌సి యు పి పాఠశాల, సిబిఎం హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన 187, 174,175 పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలు బాటిళ్లతో తాగునీరు పట్టు కోవడం కనిపించింది.ఆసక్తి చూపిన యువ ఓటర్లు.. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. సిబిఎం హైస్కూల్‌, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జివిఎంసి హైస్కూల్‌, చిట్టి వలస జెడ్‌పి బాలికల హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలు క్యూ లైన్‌లో ఉన్న వారికి పోలింగ్‌ సిబ్బంది స్లిప్పులు పంపిణీ చేసి ఓటుకు అవకాశం కల్పించారు. సాయంత్రం కరెంట్‌ కోత, చిరు జల్లుల వల్ల కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బంది ఎదురైనట్లు కొందరు ఓటర్లు చెప్పారు.

➡️