5నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

Apr 10,2024 22:15

 ప్రజాశకి- విజయనగరం కోట :  ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణ మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. దీనికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్లపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, డిటిలకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో రకాలు, జారీ, స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోస్టల్‌ బ్యాలెట్‌ల స్వీకరణ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుందన్నారు. సర్వీసు ఓటర్లనుంచి మాత్రమే ఆన్‌లైన్లో ప్రత్యేక ప్రక్రియ ద్వారా బ్యాలెట్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే వారినుంచి, ఆబ్‌సెంటీ ఓటర్లనుంచి నేరుగా బ్యాలెట్ల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. 85 ఏళ్లు పైబడినవారు, వికలాంగుల కోసం ఉద్దేశించిన హోం ఓటింగ్‌ ప్రక్రియను వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఎన్నికల సిబ్బంది ఈనెల 15 వ తేదీలోగా ఫారమ్‌ 12 లో దరఖాస్తు చేయాలని, ఈ ప్రక్రియ ఈనెల 15 నాటికి పూర్తి కావాలని చెప్పారు. నామినేషన్ల పరిశీలన పూర్తయి, అభ్యర్థులు ఖరారు అయిన వెంటనే, 2వ తేదీ నాటికి పోస్టల్‌ బ్యాలెట్ల ముద్రణ పూర్తి చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల ఓటింగ్‌ కోసం ప్రతీ నియోజకవర్గంలో అన్ని సదుపాయాలతో ఒక ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో కేంద్రంలో కనీసం ఐదు గదులను సిద్ధం చేయాలని తెలిపారు. పోస్టల్‌ ఓట్లను ధ్రువీకరించేందుకు ఇద్దరు గెజిటెడ్‌ అధికారులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి నిర్ణయించిన తేదీల మేరకు పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణ చేపట్టాలన్నారు. ఎన్నికల్లో విధులను నిర్వహించే పిఒలు, ఎపిఒలు, ఒపిఒలు, మైక్రో అబ్జర్వర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టేటిక్‌ స్క్వాడ్‌ సిబ్బంది, పోలీసులు, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతీఒక్కరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా 33 అత్యవసర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోవచ్చునని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, నోడల్‌ అధికారి సందీప్‌కుమార్‌, ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, డిటిలు పాల్గొన్నారు.

➡️