నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై బంద్

Feb 16,2024 13:00 #Nellore District

ప్రజాశక్తి-మర్రిపాడు : మండల కేంద్రంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై నిర్వహించిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ ఉత్తర భారతదేశాన్ని ఒకరికి, దక్షిణ భారత దేశాన్ని మరొకరికి అమ్మేందుకు మోడీ నిస్సిగ్గుగా చేస్తున్నారని విమర్శించారు. 2014ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, మరలా 2019లో ఇండియా పాకిస్థాన్ కు యుద్ధం జరుగబోతుందని జనాలను భయబ్రాంతులను చెసి మరలా అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజల సంపదను వారికీ అనుకూలంగా ఉన్నవారికి దారా దత్తం చేస్తున్నారన్నారు.2024లో రామున్ని బీజేపీ పార్టీలో చేర్చుకొని రామాలయం కట్టించామని చెపుతున్నారు. ప్రజలను ప్రక్క దారి పట్టించే వాగ్దానాలు చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేస్తుంటే పాలక ప్రతిపక్షాలు అడుగులకు మడుగులొత్తుతున్నారన్నారు. అన్ని పంటలకు స్వామినాథన్ సిఫార్సులు మేరకు కనీసం మద్దతు ధర నిర్ణయించి ధరలు అమలు అయ్యేటట్లు పార్లమెంట్లో చట్టం చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం రద్దు చేయాలని, రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని నిర్వాసితులకు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్ డి రహంతుల్లా సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, అధ్యక్షులు శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు సుధాకర్, తిరుపతి అంగన్వాడి ప్రాజెక్టు నాయకురాలు లక్ష్మి, రైతు సంఘం నాయకులు లక్ష్మయ్య మరియు రైతులు పాల్గొన్నారు.

➡️