వికటించిన ఫేస్ బుక్ ప్రేమ

Apr 11,2024 23:34

ప్రజాశక్తి – పొదిలి
యువతీ, యువకులు సోషల్ మీడియా రాకతో దేశాలు ఖండంతరాల హద్దులు దాటేస్తున్నారు. ఫేస్‌బుక్‌ పరిచయంతో ఆకర్షణకు లోనవుతున్నారు. సహజీవనానికి సిద్దపడుతున్నారు. ఈ సంఘటన గురువారం పొదిలి బస్టాండ్ కేంద్రంగా గురువారం బహిర్గతమైంది. సుమారు ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా నంద్యాలకు చెందిన ఒక యువతికి, దర్శి మండలం బండి వెలిగండ్ల గ్రామానికి చెందిన యువకునితో ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమగా మారింది. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. యువకుని వైపు నుంచి ఏమి ఆశించిందో తెలియదు కానీ ఆ యువతి పెళ్లి విషయం పక్కన పెట్టి సహజీవనానికి సిద్ధపడింది. తల్లిదండ్రులను కాదని 10నెలల క్రితం ప్రియుడి వద్దకు చేరింది. అతనితో సహజీవనం ప్రారంభించింది. రొజులు గడిచే కొద్ది యువకుడి అసలు రంగు బయట పడింది. మద్యానికి బానిసైన యువకుడు రోజు ఆమెను వేధింపుల గురి చేస్తున్నాడని ఆరోపించింది. ప్రియుడి వేదింపులు తాళలేక యువతి తిరిగి ప్రయాణమైంది. తెలిసో తెలియక చేసిన తప్పు దిద్దుకునేందుకు తన పుట్టిల్లు నంద్యాల వెళ్లేందుకు పొదిలి బస్టాండుకు వచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఉన్న యువతిని వెంబడించిన యువకుడు బలవంతంగా ఆమెను తన ఇంటికి తీసుకు పొయే ప్రయత్నంలో ఇరువురు ఘర్షణ పడ్డారు. యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని అక్కడున్న ఆర్టిసి సిబ్బంది, ప్రయాణికులు అడ్డుకున్నారు. జరిగిన విషయం ఆమె ఆర్టీసీ సిబ్బందికి మొరపెట్టుకుంది. వారు పొలీసులకు సమాచారం ఇచ్చారు. పొలీసులు ఇరువురిని విచారించారు. యువతిని సొంత పట్టణానికి పంపించారు. ప్రియుడిని ఇంటికి పంపించారు.

➡️