‘ఎస్‌వికెపి కళాశాల’లో విద్యార్థులను చేర్చుకోవాలి

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఎస్‌వికెపి ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలో 2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదువుకునే విద్యార్థులను చేర్చుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ ఏడాదిలో ఇంటర్‌లో, డిగ్రీలో చదువుకోవాలని ఆసక్తి కలిగిన విద్యార్థుల ప్రవేశానికి యాజమాన్యం అడ్డుతగలడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. ప్రవేశాలను అడ్డుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి విజరు మాట్లాడుతూ 1964 నుంచి మార్కాపురంలో ఎస్‌వికెపి ఎయిడెడ్‌ కళాశాలగా కొనసాగుతోందని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు యుజిసి, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఈ కళాశాలలో మౌలిక సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందిని ఏర్పాటు చేశారన్నారు. ఈ కళాశాలలో నేటికీ పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. మార్కాపురం పట్టణంలోని విద్యార్థులతో పాటు మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కొనకనమిట్ల మండలాల నుంచి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సులలో చేరి ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ ఫీజులతో చదువుకునేవారన్నారు. ఎయిడెడ్‌ కోర్సులలో 2019-20 విద్యా సంవత్సరం వరకు మాత్రమే విద్యార్థులను చేర్చుకున్నారని అన్నారు. ఆ తర్వాత కాలం నుంచి కళాశాల యాజమాన్యం, సిబ్బంది పేద బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అడ్మిషన్లను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్‌ల కోసం విద్యార్థులు కళాశాలలో సంప్రదించగా తమ కళాశాలలో అడ్మిషన్‌లు లేవని వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రైవేటు కళాశాలలో చేరమని ఉచిత సలహా ఇచ్చి పంపడం పరిపాటిగా మారిందన్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలల్లో అధిక ఫీజులను చెల్లించే స్థోమత లేకపోవడంతో చదువులు మధ్యలో ఆపేస్తున్నారన్నారు. ఎన్నో లక్ష్యాలతో ఏర్పాటైన ఈ ప్రభుత్వ ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలలో గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేకున్నా ఎయిడెడ్‌ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి (పర్మినెంట్‌ సిబ్బంది) విద్యార్థులను చేర్చుకుందామనే ఆలోచన లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఎస్‌వికెపి ఎయిడెడ్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సులలో విద్యార్థులను చేర్చుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతనంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలలను ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనాకు వినతిపత్రం అందించారు.

➡️