దళిత విద్యార్థులకు అండగా మంత్రి స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ: రాష్ట్రంలో దళితుల విషయంలో మాట్లాడే అర్హత వైసిపికి లేదని, వారిని మోసం చేయడంలో మాత్రం ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని శింగరాయకొండ టిడిపి మండల ఎస్సీ సెల్‌ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం నాడు శింగరాయకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ ఓటమిపాలైన వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేషుకు ఇప్పుడు దళితులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విదేశీ విద్యను తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెడితే అప్పుడు నిద్రపోయాడా అన్నారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆదిమూలపు సురేష్‌ శింగరాయకొండ గురుకుల పాఠశాలలో సైన్స్‌ గ్రూపులను ఎత్తేసినప్పుడు దళిత విద్యార్థులు గుర్తు రాలేదా అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తొలి సంతకం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మంచి భోజనంతో పాటు సైన్సు గ్రూపులను ఏర్పాటు చేయాలని సంతకం పెట్టారని అన్నారు. ఇది దళితులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చే మంచి గౌరవమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులను మోసం చేసి ప్రభుత్వం పోయి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నాయకులకు ఇప్పుడు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని వారు ధ్వజమెత్తారు. ఈ విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు సుదర్శి ప్రసాదరావు, పొనుగోటి కొండయ్య, గర్నెపూడి సుబ్రహ్మణ్యం, నూతలపాటి చైతన్య, బొడ్డు బాలకోటయ్య, ఎస్టీ సెల్‌ నాయకులు పోట్లూరి లక్ష్మయ్య, అంబటి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️