శింగరాయకొండ వైసిపి కార్యాలయానికి టులెట్‌ బోర్డు

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా శింగరాయకొండలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి శుక్రవారం టు లెట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైసిపి ఓటమితో ఇప్పటివరకు ఆ పార్టీ కార్యాలయానికి ఉచితంగా బిల్డింగ్‌ను ఇచ్చిన వారు తిరిగి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని రంగులు మార్చి అద్దెకిస్తామని బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గత ఐదు సంవత్సరాలకుపైగా మాదాసి వెంకయ్య, వరికూటి అశోక్‌బాబు.. ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు నడిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడం, ఆదిమూలపు సురేష్‌ ఓడిపోవడంతో వైసిపి కోసం కార్యాలయాన్ని ఇచ్చిన వారు తిరిగి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు.కొండపి నియోజకవర్గానికి సంబంధించి శింగరాయకొండలో ఆదిమూలపు సురేష్‌ నివాసంతో పాటు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ క్యాంపు కార్యాలయం కూడా మూతపడింది.

➡️