8వ రోజు కొనసాగిన జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన

Feb 8,2024 16:05 #Dharna, #ggh workers, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ కాకినాడ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు వైద్య సేవలు అందించడం లో జిజిహెచ్ అద్భుతమైన సేవలు అందిస్తుందన్నారు. అయితే ఈ కృషిలో శానిటేషన్ వర్కర్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్స్ ఇతరుల కంటే ఎక్కువ గా పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అందుకు తగిన విధంగా జీతాలు అందడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలను కూడా ఆందోళనకు తీసుకువస్తామన్నారు. కార్మికురాలు సిహెచ్. పుష్ప మాట్లాడుతూ తాము గత 22 సంవత్సారాలు గా జిజిహెచ్ లో కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ గా పని చేస్తున్నామన్నారు. యజమానులు చెల్లించవలసిన పిఎఫ్ వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరించడం గతంలో జరగలేదన్నారు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల జీతాలు పెంచాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తో పాటు యూనియన్ నాయకులు ఆర్. రమేష్, జె. శేషు, ఎస్. వాసు, చంద్రకళ, కుమారి, అరుణ, వెంకట లక్ష్మీ, మంగ, బి. శ్రీకాంత్, ఎం. రవి, మూర్తి, శ్రీనివాస్, జనార్ధన్, కోటి, ఏసు, నరేంద్ర, కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆసుపత్రి మాతాశిశు విభాగం వద్దనుండి ప్రదర్శన ప్రారంభించి, ఓపి విభాగం వద్ద ముగించారు.

➡️