ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

May 11,2024 21:17

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు అవుతున్న సిబ్బందికి మూడో ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ సమక్షంలో శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో రాండమైజేషన్‌ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అనంతరం సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు సీల్దు కవర్‌లో పంపించడం జరుగుతుందని చెప్పారు. ఈనెల 12న ఉదయం కవర్లను విప్పడం జరుగుతుందని, తద్వారా సిబ్బందికి ఏ పోలింగ్‌ కేంద్రానికి నియమించింది తెలుస్తుందని చెప్పారు. మైక్రో అబ్జర్వర్‌ల రెండవ ర్యాండమైజేషన్‌ను, ఇవిఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ కూడా పూర్తి చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, కంట్రోల్‌ రూం ఇన్‌ ఛార్జ్‌ అధికారి, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాట్లు పరిశీలనసాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పరిశీలించారు. ఉద్యాన కళాశాలలో ఎన్నికల సామాగ్రి స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల వారీగా వేసిన శిబిరాల్లోని కౌంటర్లు వద్ద టేబుళ్లు, కుర్చీల ఏర్పాటును పరిశీలించి పలు సూచనలను చేశారు. పోలింగ్‌ కేంద్రాల సామాగ్రి స్వీకరణ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇవిఎంల భద్రతా, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు, పనితీరును అందుబాటులో ఉంచిన జనరేటర్లు వివరాలను విద్యుత్‌ శాఖ ఇఇ పి.త్రినాథరావును అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని అగ్నిమాపక అధికారి కె.శ్రీనుబాబును ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్దకు సులువుగా చేరుకొని రాక పోకలకు అంతరాయం కలగకుండా రోడ్డు పనులను చేపట్టాలని పంచాయితీ ఇంజనీరింగ్‌ అధికారులను సూచించారు. అనంతరం కళాశాల ముందు భాగంలో బస్‌ల పార్కింగ్‌ స్థలాన్ని గుర్తించి అదే స్థలంలో బస్‌లను నిలపాలని అన్నారు. ఆయా అధికారులకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోల్‌ రూమ్‌ ఎస్‌డిసి ఆర్‌.సూర్య నారాయణ, డ్వామా పిడి కె.రామచంద్రరావు, డిఆర్‌డిఎ పిడి వై.సత్యంనాయుడు, ఆర్‌ఎస్‌ డబ్ల్యు ఇంజనీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర్‌రావు, డిపిహెచ్‌ఇఒ కెజిఎన్‌ నరసింగ రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్‌ అధికారి ఎస్‌.వేణుగోపాలరావు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఉదయం 4 గంటల నుంచే ఎన్నికల సిబ్బందికి బస్సులుజిల్లాలో ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి ఆదివారం ఉదయం 4 గంటల నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కురుపాం, సాలూరు, పాలకొండ నియోజక వర్గ కేంద్రాలకు చేరుకొనేందుకు బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల సిబ్బంది తమ ఎన్నికల ఉత్తర్వులు చూపించి ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.

➡️