వైసిపి భీమిలి మేనిఫెస్టో విడుదల

May 10,2024 00:17 #Bml Ycp Manifesto
Muthamsetti, Manifesto

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి భీమిలి నియోజక వర్గ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తగరవువలసలో ఆర్‌టిసి బస్సు కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని, ఫిషింగ్‌ జెట్టి నిర్మాణం పూర్తి చేసి మత్స్య కార యువతకు ఉపాధి కల్పిస్తామని, చంద్రంపాలెం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని, తగరపువలసలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను నియోజక వర్గ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ముత్తంశెట్టి విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికై రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఆయన హయాంలో వేసిన శిలాఫలకాలు నేటికీ వెక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ ఎస్‌.గిరిబాబు, పద్మనాభం ఎంపిపి కె.రాంబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ డి.పెదబాబు, పార్టీ నాయకులు జి.వెంకటరెడ్డి, ఎస్‌.కరుణాకరరెడ్డి, ఎం.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు

➡️