4 వరకు ఉత్కంఠే- ఆగని కూడికలు, తీసివేతలు – నాడు ఓటర్ల చుట్టూ… నేడు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు

ప్రజాశక్తి – పుల్లంపేట ఎన్నికల పోలింగ్‌ ముగిసినప్పటికీ, గెలుపోటములపై అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎడతెగని ఉత్కంఠం కొనసాగుతుంది. కేవలం అభ్యర్థులు, పార్టీ నాయకుల్లోనే కాదు ఆయా పార్టీల కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఇదే రకమైన చర్చ వినిపిస్తోంది. జూన్‌ 4 న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయి. అభ్యర్థులంతా ఇప్పటికీ కూడికలు తీసివేతలతో కుస్తీ పడుతున్నారు. ఎన్ని లెక్కలు వేసుకున్నా ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే. పోలింగ్‌ రోజు వరకు ఓటర్లే దేవుళ్ళుగా భావించి వంగి వంగి నమస్కారాలు చేసిన అభ్యర్థులు, వారి తరపు ప్రచారకర్తలు నేడు గెలుపును ఆకాంక్షిస్తూ గుళ్లూ గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారం రోజుల్లో అభ్యర్థులు భక్తిశ్రద్ధలతో ఆలయాలకు సందర్శించి అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు. కానీ నిజరూపం ఓట్ల రూపంలో ఇవిఎంలలోనిక్షిప్తమై ఉంది. ఆయా బాక్సులన్నీ అన్నమయ్య జిల్లా కేంద్రంలో శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద భద్రంగా ఉన్నాయి. అభ్యర్థులు ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. అతి నమ్మకంతో ఉన్నవారు విజయోత్సవాలకు కూడా సిద్ధమవుతున్నారు. కేవలం కూటమి, వైసిపి అభ్యర్థులే కాకుండా ఇతర పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ప్రజా విశ్వాసాన్ని చూరగొనున్నారు. కూటమి, వైసిపి అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కూడా జోరుగానే సాగుతున్నాయి. జనసేన, వైసిపి అభ్యర్థులు ఎవరికి వారే ప్రజలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒకరి విజయంతో మరొకరికి అపజయం అనివార్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు అదే స్థాయిలో ఓటమిని అంగీకరించే పరిస్థితి ఉంటుందా? లేక ప్రజలపై నిందలు దాడులకు తెగించే ప్రమాదం ఉంటుందా? వేచి చూడాల్సిందే. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి చల్లారలేదు. వాస్తవానికి మన జిల్లాలో ఫలితాల సందర్భంలో ఎటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. కానీ పోలింగ్‌ సందర్భంగా ఇతర జిల్లాలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దష్టిలో పెట్టుకొని శాంతి పద్ధతులపై ప్రత్యేక దష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

➡️