ప్రారంభమైన పాఠశాలలు

Jun 13,2024 21:46

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో పాఠశాలకు వచ్చే విద్యార్దులు సంఖ్య 50 శాతం దాటలేదు. 50 రోజులు పాటు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలలు స్కూల్‌ బ్యాగ్‌ లు పట్టుకొని ఆటోల్లో, సైకిళ్ల మీద పాఠశాలలకు చేరుకున్నారు. మొదటి రోజు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరు కాకపోవడంతో పేర్లు నమోదు తరగతి పదోన్నతులు విద్యార్దులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ గడిపారు. వేసవి సెలవుల్లో ఆడిన ఆటలు, చేసిన పనులు గురుంచి విద్యార్దులు ముచ్చటించుకున్నారు. 50 రోజుల పాటు ఒకర్ని ఒకరు కలుసుకోకపోవడంతో వేసవి సెలవులో ఏం చేశారో మాట్లాడుకుంటూ పాఠశాలలో సందడి చేశారు. ఈ విషయమై స్థానిక ఎంఇఒ సామల సింహాచలం స్పందిస్తూ వేసవి సెలవులకు అలవాటు పడిన విద్యార్థులు హాజరు తొలి మూడు రోజులు తక్కువగానే ఉంటుందని, ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేయడానికి కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాటిని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వారం రోజుల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో టెక్స్‌ట్‌, నోట్‌ పుస్తకాలు, యూనిఫారాలు అందిస్తామన్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల ముందు టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోలను ఫ్లెక్సీలు తయారుచేసి ప్రదర్శిస్తూ తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.వీరఘట్టం: మండలంలో మొదటిరోజు తరగతులకు విద్యార్థులు పలచబడ్డారు. మండలంలోని పది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 11 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు , 39 ప్రాథమిక పాఠశాలలు, 1 కేజీబీవీ ,1 గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు 5766 మంది విద్యార్థులకు గానూ గురువారం 3295 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

➡️