ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులదే కీలక పాత్ర

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి,చిత్రంలో ఎస్‌పి, ఎన్నికల పరిశీలకులు

ప్రజాశక్తి-అనకాపల్లి

ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌ శెట్టి అన్నారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతున్న సెక్టార్‌ అధికారుల శిక్షణా కార్యక్రమాల్లో గురువారం ఎస్‌పి కెవి.మురళీకృష్ణతో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెక్టార్‌ అధికారులకు మినిస్టీరియల్‌ అధికారాలు ఉంటాయని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుండి ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రి పోలింగ్‌ సిబ్బందిని తీసుకువెళ్లడం మొదలు, పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి తిరిగి వారిని సరంజామాతో సహా రిసెప్షన్‌ కేంద్రాలకు సురక్షితంగా తీసుకువచ్చే వరకు సెక్టార్‌ అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. రూట్‌ ఆఫీసర్ల సహకారంతో పోలింగ్‌ సిబ్బందిని బూత్‌లకు చేర్చడం, వారికి అనువైన పరిస్థితులను కల్పించడం చేయాలన్నారు. మార్గమధ్యంలో ఎటువంటి ఇబ్బందులలు ఏర్పడినా వెంటనే పరిష్కరిచాలన్నారు. సెక్టార్‌ అధికారులకు వారి పరిధిలో ఉన్న ప్రదేశాలు, గ్రామాలలో గల వాతావరణం, రాజకీయ, శాంతి భద్రతల పరిస్థతి క్షుణ్ణంగా తెలిసి వుండాలని సూచించారు. ప్రజలను, సిబ్బందిని సంయమనంతో ప్రోత్సాహించాలన్నారు. ఎస్‌పి మురళీకృష్ణ మాట్లాడుతూ సెక్టార్‌ అధికారులు ముందుగా ఆయా ప్రాంతాలను పరిశీలించి పోలీసు వారికి తగిన సమాచారం అందించాలని ఆదేశించారు. సెక్టార్‌ అధికారికి పోలీసు వారు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటారని చెప్పారు. ఈ సమావేశాలలో జనరల్‌ అబ్షర్వర్‌ దల్జీత్‌ సింగ్‌, పోలీసు పరిశీలకులు డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, తాశీల్దార్లు, డిటిలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

➡️