అంగన్వాడీల ఆందోళన పట్టదా..?

Dec 25,2023 21:45

తల్లుల కోసం రోడ్డుపై బైటాయించిన చిన్నారులు (ఫైల్‌ ఫొటో)

                  హిందూపురం :పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అభివృద్ధి చేస్తున్నామని, ఉద్యోగులను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె బాటపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్రాల్లోని చిన్నారులు భోజనానికి, ఆటపాటలకు దూరమవుతున్నారు. గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు గత 14 రోజులుగా చంటి బిడ్డలను తీసుకుని రోడ్డుపై వచ్చి అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వీరిపై కాస్తా జాలి కూడా చూపడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఆందోళన కార్యక్రమాలు హోరెత్తాయి. ప్రభుత్వ వైఖరితో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.25 మంది ఆరేళ్లలోపు చిన్నారులు, 16 వేల మంది గర్భిణులు, 18 వేల మంది వరకు బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి వాటిని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సొంత భవనాలకు వేసిన తాళాలను కొన్నిచోట్ల పగలగొట్టించి, అద్దె భవనాలతో సహా మరికొన్ని చోట్ల నోటీసులు అంటించింది. ప్రభుత్వ వైఖరి ప్రజల్లో కూడా అసహనాన్ని తెప్పించింది. మూడు నెలల లోపు చిన్నారులకు రోజు ఒక గుడ్డు, పాలు అందించేవారు. ప్రస్తుతం పిల్లలకు పోషక ఆహారం అందడం లేదు. ఆటాపాట లేదు. సచివాలయ సిబ్బందితో నిర్వహణకు యత్నం గర్భిణీలు, బాలింతలు, మూడు నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీ చేయాల్సిన బాలామృతం కిట్లు సచివాలయాల సిబ్బందితో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్నా అక్కడ కార్యకర్తలు, ఆయాలు కనిపించకపోవడంతో పిల్లలు రావడం లేదు. కేంద్రాలు తెరిచిన బువ్వ అందలేనప్పుడు ఏం ప్రయోజనం అని చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయాల్లో విధులతో పాటు అదనంగా ఈ బాధ్యతలను అప్పగించడంపై కొందరు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని తెరుస్తున్నామని పేరు చెప్పేందుకు అంగీకరించని మహిళా పోలీసులు, సచివాలయ సెక్రేటరీలు వాపోతున్నారు. ఈ కేంద్రాల్లో వంట వార్పు పర్యవేక్షణ అంటే కష్టం అంటున్నారు.

➡️