అభివృద్ధే ధ్యేయంగా పని చేద్దాం : మంత్రి

కాంప్యాక్ట్‌ వాహనాన్ని స్వయంగా నడిపి ప్రారంభిస్తున్న మంత్రి సవిత

         పెనుకొండ టౌన్‌ : పెనుకొండ అభివృద్ధే ధ్యేయంగా పని చేద్దామని, కక్షసాధింపు రాజకీయాలు వద్దు అంటూ రాష్ట్ర బిసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామంత్రి సవిత తెలియజేశారు. నగర పంచాయతీలో చెత్తసేకరణ చేసే కాంప్యాక్ట్‌ వాహనాన్ని బుధవారం నాడు మంత్రి నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెనుకొండలో గతంలో జరగని విధంగా అభివృద్ధి పనులు జరగబోతున్నాయన్నారు. అందులో భాగంగా రూ.47 లక్షల వ్యయంతో చెత్త సేకరణ కోసం కాంప్యాక్ట్‌ వాహనం, రూ.20 లక్షల వ్యయంతో చెత్త డంపు చేసే గ్యాబ్రేజీలు పట్టణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెనుకొండ ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపుతానన్నారు. కౌన్సిలర్లు అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాజకీయలు ఎన్నికల వరకూ మాత్రమే చూడాలని మంత్రి పేర్కొన్నారు. అందరం కలసి కట్టుగా పని చేసి పెనుకొండను అభివృద్ధి పథంలో నడపుదాం అని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఫించను రూ.3 వేల నుంచి రూ.4వేలకు పెంచి, ఎప్రిల్‌, మే, జూన్‌ నెలకు సంబంధించిన రూ.3 వేలతో కలిపి ఒకటో తేదీన రూ.7 వేలను ఫించన్‌దారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్మన్‌ ఉమర్‌ఫరూక్‌, వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌కుమార్‌, కమిషనర్‌ వంశీకృష్ణభార్గవ్‌, కౌన్సిలర్లు రామాంజినేయులు, తయ్యబ్‌, గిరి, గణేష్‌, బాబు, శ్రీరాములు, సద్దాం, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు తివేంద్ర, బాబుల్‌రెడ్డి, మైనార్టీ నాయకులు దాదు, సిద్దయ్య పాల్గొన్నారు.

➡️