భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం

సమీక్ష సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

        పుట్టపర్తి అర్బన్‌ : జాతీయ రహదారులకు భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందజేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు కలెక్టరేట్‌లో భూ సేకరణ, రైల్వే పనులకు సంబంధించి రైతులకు పరిహారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, నేషనల్‌ హైవే అధికారి గిడ్డయ్య, ఆర్డీవోలు వెంకట శివ సాయి రెడ్డి, భాగ్యరేఖ, ఏపీఐఐసీ అధికారి సహిన సోనీ సంబంధిత తహశీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణ కోసం బి.కొత్తపల్లి, గోరంట్లలో భూ సేకరణ జరిగిందన్నారు. నష్టపరిహారం చెల్లింపుల కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 11.04 కోట్లు పరిహారం పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి నాలుగు లైన్ల విస్తరణ, పుట్టపర్తి నుంచి కోడూరు వరకు భూములు నష్టపోయిన నిర్వాసితులకు పరిహారం అందించనున్నట్లు చెప్పారు. బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల, పెనుకొండ డివిజన్‌లో చిలమత్తూరు మండలాల్లోని రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రతివారం పరిహారం పంపిణీపై ప్రత్యేక సమీక్ష జరుగుతుందన్నారు. కోర్టుల్లో ఉన్న కేసులకు కౌంటర్‌ వేయాలన్నారు. ఆయా మండలాల పరిధిలోని అధికారులు పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, నల్లమాడ, హిందూపురం, తలుపుల, చిలమత్తూరు, ఓడిసి, కదిరి, మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

➡️