‘అధికారం’తో ఇసుక దోపిడీ

పెన్నా నది వద్ద యంత్రాలను అడ్డుకుని ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు

                 హిందూపురం : వైసిపి మంత్రులు, నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక రీచ్‌ల పేరుతో పెన్నానదిలో ఇసుకను అక్రమంగా కర్నాటకకు తరలిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు. హిందూపురం రూరల్‌ మండలం అప్పలకుంట గ్రామ సమీపంలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌ పేరుతో జెసిబి, ఇటాచీలు, టిప్పర్లతో తరలిస్తున్న ఇసుక రవాణాను గ్రామస్తులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ అండతో ఒక ప్రయివేటు సంస్థ(ప్రతిమ ఇన్ఫోసిస్‌) ఇసుక రీచ్‌కు అనుమతులు పొందిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లు పెద్ద లారీలలో ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా కర్నాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాకు పోలీసులు, అధికారులు దగ్గరుండి ప్రోత్సహించడం విచాకరం అన్నారు. సామాన్యులు ఇంటి నిర్మాణం కోసం ఒక ట్రాక్టర్‌ ఇసుక కావాలన్న దొరకడం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇసుక దొరకడం లేదన్నారు. అక్రమ ఇసుక రవాణాతో పెన్నా నది చుట్టూ భూగర్భ జలాలు అడుగంటి వేలాది ఎకరాలకు నీరులేక బీడుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి ఇసుక రవాణాను అడ్డుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రమేష్‌ కుమార్‌, అంజినప్ప, ఆనంద్‌ కుమార్‌, రాము, ఆదినారాయణ, టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

➡️