అనంత ఎస్పీ, కలెక్టర్‌పై బదిలీ

ఎస్పీ అన్బురాజన్‌, కలెక్టర్‌ ఎం.గౌతమి

      అనంతపురం ప్రతినిధి : ఎన్నికల సంఘం అనంతపురం జిల్లా ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో వారికి ఎక్కడా ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని కూడా సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆ ఇద్దరు అధికారులు జిల్లాకు వచ్చి సరిగ్గా ఏడాది కూడా పూర్తవలేదు. వీరు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విపక్షాల నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఓటర్ల జాబితాలో అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా జిల్లాకు వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన సైతం చేపట్టి దిగువ స్థాయి అధికారులపైనా చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓటర్ల జాబితా పరిశీలనలోనూ లోపాలున్నట్టు కొంత మంది నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. వీటిన్నంటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం కలెక్టర్‌, ఎస్పీ బదిలీకి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి బాధ్యతలు చేపట్టి ఈనెల 11వ తేదీకి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది. అంటే ఇప్పటికి ఇంకా ఏడాది కూడా పర్తవలేదు. ఎన్నికలు అయిపోయే వరకు ఆమె కొనసాగుతుందని అందరూ భావించారు. కాని ఎన్నికల సంఘం అనూహ్యంగా ఆమెపై బదిలీ వేటు వేసింది. ఇక జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఆరుమాసాలు కూడా పూర్తవలేదు. గతేడాది సెప్టంబర్‌ 17వ తేదీన ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇంతలోనే ఆయనపైనా బదిలీ వేటు పడటం గమనార్హం. ఆయన కడపలో చాలా కాలం పనిచేసిన సమయంలో అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐపై కేసు నమోదు చేసే విషయంలో ఈయన కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం ఈయనపై వేటు వేసి ఉండవచ్చునన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బదిలీ వేటు పడిన ఇద్దరు అధికారుల స్థానంలో కొత్త వారిని ఎవరిని నియమిస్తారన్నది ఇంకా తేలలేదు. వీరిని మాత్రం వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

➡️