ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి : కలెక్టర్‌

Jan 5,2024 08:55

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

   పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరిగి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలు తీరుపై గహ నిర్మాణ శాఖ డిఈ, ఏఈలు, వివిధ ఏజెన్సీలతో గురువారం నాడు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు హౌసింగ్‌ పీడీ వెంకట నారాయణ, హౌసింగ్‌ ఓఎస్‌డి చంద్రమౌళి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి రషీద్‌ ఖాన్‌, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, మెప్మా అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సంతప్తి స్థాయిలో అందించాలనే లక్షం మేరకు అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పనులు ఈనెల 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటికే ప్రారంభించిన 20,965 వేల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆ శాఖ ఇంజినీర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయంలోని అసిస్టెంట్లు, వార్డు సెక్రటరీలు రానున్న రెండు నెలలు జగనన్న ఇళ్ల నిర్మాణం ప్రగతిపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సిమెంటు, ఇనుముకు ఎటువంటి కొరతా లేదన్నారు. ధర్మవరం, మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గం నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించాలని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు ఉండే విధంగా ప్రణాళికలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 65,609 ఇళ్లను నిర్మించడానికి ఆమోదం తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత గహ నిర్మాణ శాఖ అధికారులు ఏఈలు, డిఇలు పాల్గొన్నారు.

➡️