ఇళ్ల పట్టాల కోసం కదంతొక్కిన పేదలు

చిలమత్తూరులో ర్యాలీ నిర్వహిస్తున్న పేదలు

            చిలమత్తూరు : ఇళ్ల స్థలాల కోసం చిలమత్తూరులో పేదలు కదం తొక్కారు. హైకోర్టు తీర్పు మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. చిలమత్తూరు దిగువ బస్టాండ్‌లో ర్యాలీ ప్రారంభం అయ్యింది. అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. అక్కడ బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్‌.వెంకటేష్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆద్వర్యంలో పేదలు గత 7 నెలలుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. పేదలు కోడూరు రెవెన్యూ పొలం 805-6, 805-7 సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమిలో భూస్వాధీన ఉద్యమం నిర్వహించి గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉన్నారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు బలవంగా జెసిబిలతో వాటిని తొలగించారన్నారు. పేదల పక్షాన పోరాటం సాగిస్తున్న సిపిఎం నాయకుడు ప్రవీణ్‌కుమార్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. పదలకు పట్టాలు ఇవ్వమంటే ఇలా అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల పట్టాలపై న్యాయం పోరాటం చేయగా, హైకోర్టు పదల పక్షాన తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు స్పష్టంగా 8 వారాల లోపు పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పు ఇచ్చి ఆరు వారాలు అవుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హైకోర్టు తీర్పు మేరకు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ మాట్లాడుతూ సమస్యను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురం సిపిఎం నాయకులు ఎంపిడిఒ, పోలీసు, విద్యుత్‌ శాఖ అధికారులకూ వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వెంకటేష్‌, లక్ష్మినారాయణ, రామచంద్ర, రాయల్‌ చందు, సదాశివరెడ్డి, రహంతుల్లా, అబ్బాస్‌తో పాటు మహిళలు పాల్గొన్నారు.

➡️