ఈత చెట్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Feb 28,2024 22:28

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

                     పుట్టపర్తి అర్బన్‌ : రొద్దం మండలం ఆర్‌. లోచర్ల గ్రామ రెవెన్యూ పొలంలో కొందరు భూస్వాములు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈత చెట్లను జెసిపి తో ధ్వంసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం జిల్లా ఎక్సైజ్‌ అధికారి సహదేవుడుకు ఇంతియాజ్‌తో పాటు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ఈఎస్‌ వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న సమర్పించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఆర్‌ లోచర్ల గ్రామ పొలం సర్వే నంబర్‌ 60-2 లో 201 ఎకరాలు కుంట పోరంబోకు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇందులో 20 సంవత్సరాలుగా ఈత చెట్లు, వేప చెట్లు వేలాదిగా ఉన్నాయన్నారు. రొద్దం మండలంలో సుమారు 500 కల్లుగీత కార్మికుల కుటుంబాలు ఈత వనం పై ఆధారపడి కల్లు గీసుకొని జీవిస్తున్నాయన్నారు. అయితే కంచి సముద్రం గ్రామానికి చెందిన కొంతమంది భూస్వాములు స్థానిక అధికార పార్టీ నాయకుల అండదండలతో జెసిపి యంత్రాల ద్వారా ఈత చెట్లను, వేప చెట్లను పూర్తిగా ధ్వంసం చేసి కాల్చి బూడిద చేశారన్నారు. అక్కడ కల్లుగీత కార్మికులు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేవలం 500 రూపాయలు జరిమానా విధించి చేతులు దులుపుకున్నారన్నారు. విషయం తెలిసి సిపిఎంతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆ ప్రదేశాల్లో పర్యటించి నిజ నిర్ధారణ చేశామన్నారు. దౌర్జన్యంగా ఈత వనాలను, వేప చెట్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన జిల్లా ఎక్సైజ్‌ అధికారి సహదేవుడు మాట్లాడుతూ ఈత వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సిద్దు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️