ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పాటించాలి

Jan 7,2024 21:49

 సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

                    పుట్టపర్తి అర్బన్‌ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి జిల్లాలో ఎన్నికలు నిర్వహణ పారదర్శకంగా జరగడానికి తగిన చర్యలు తీసుకుందామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులతో పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలోని నియోజకవర్గాల సహాయ ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు నిర్వహణపై ఈనెల 9,10 తేదీలలో విజయవాడలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ సమావేశం నిర్వహిస్తోందన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ రాబోవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ రవికుమార్‌, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒలు భాగ్యరేఖ, రమేష్‌ రెడ్డి, వంశీకృష్ణ, ఈఆర్వోలు పాల్గొన్న ఈ సమావేశంలో పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమీక్షించి కలెక్టర్‌ తగు సూచనలు చేశారు. ఓటర్‌ జాబితా వివరాలు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు, ఇవిఎంల గోదాములు, కౌంటింగ్‌ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, సమస్యాత్మక గ్రామాల గుర్తింపు తదితర విషయాలను కలెక్టర్‌ చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ మొయినుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️