ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి : కలెక్టర్‌

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         ధర్మవరం టౌన్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులకు సూచించారు. బుధవారం నాడు పట్టణంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ముందుగా పట్టణంలోని మార్కెట్‌యార్డు గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదాన్ని పరిశీలించారు. నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు క్రీడా మైదానం సరిపోతుందా? లేదా? అన్న వాటిని నేరుగా పరిశీలించి, అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాయగూరల మార్కెట్‌ వద్ద ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా పట్టాల పొందిన లబ్ధిదారులకు సచివాలయ వ్యవస్థ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే పద్ధతులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసే పనిని వేగవంతంగా పూర్తి చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ రమణారావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌ రెడ్డి, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఈశ్వరయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి, డీఈవో మీనాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️