ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించండి

Feb 9,2024 22:32

 సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

                      పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పక్రియ పై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా పోలింగ్‌ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్య, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, పుట్టపర్తి ఆర్‌డిఒ భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మడకశిర నియోజకవర్గంలో ప్రత్యేక అధికారి గౌరీ శంకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా ముందుగానే అవగాహన చేసుకుని పొరపాట్లు జరగకుండా చూడడమే ఎన్నికల పోలింగ్‌ విధులలో అతి ప్రధానమైన బాధ్యతగా భావించాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా లోటుపాట్లు లేకుండా పోలింగ్‌ విధులకు సిద్ధం కావాలని సూచించారు. ఈవీఎంల సీలింగ్‌ నుంచి మాక్‌ పోలింగ్‌ వరకు గత ఎన్నికల కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని వీటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని సరైన అవగాహన కలిగి ఉంటే క్రింది స్థాయి ప్రొసీడింగ్‌ ఆఫీసర్లు అసిస్టెంట్‌ ప్రొసైడింగ్‌ ఆఫీసర్లకు సక్రమంగా అవగాహన కల్పించగలుగుతారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ ట్రైనర్లు పూర్తిగా పోలింగ్‌ విధులను అర్థం చేసుకుని క్రింది స్థాయి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల కమిషన్‌ అందించిన ఆర్‌ఒ హ్యాండ్‌ బుక్కును తప్పనిసరిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఎన్నిక కూడా కొత్తగానే ఉంటుందని భావించి పోలింగ్‌ పక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధం కావాలన్నారు. వివిధ పత్రికలో వచ్చిన వాటికి సంబంధించి పూర్తి వివరాలను సంబంధించిన ఎఇఆర్‌ఒల నుంచి తెప్పించుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు అందజేసే ఫిర్యాదులను ఎలక్షన్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తీసుకుని పరిశీలించాలని అన్నారు. ఇఆర్‌ఒలు అందరూ వాటికి సంబంధించిన నియోజకవర్గ పరిధిలో రూట్లు ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. ఎఇఆర్‌ఒలు ప్రతి మండల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు వాటికి సంబంధించిన రూట్లలో పోలింగ్‌ కేంద్రాలలో గల సౌకర్యాలను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఎంఇఒల అందరితో సమావేశం నిర్వహించి వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలలో ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే దానికి సంబంధించి నిధులు మంజూరు చేసి ఫిబ్రవరి 21 కల్లా పనులు పూర్తిచేసి నివేదిక పంపించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఇఆర్‌ఒలు అందరు తాము ఉన్న స్ట్రాంగ్‌ రూములను పరిశీలించాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు పంపించాలన్నారు. అనంతరం డిఆర్‌ఒ పోలింగ్‌ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు సద్వినియోగం చేసుకొని సజావుగా ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️