‘ఎమ్మెల్యే సార్‌.. ముఖ్యమంత్రితో మాట్లాడండి’..!

Dec 26,2023 22:05

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నివాసం వద్ద నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

       పుట్టపర్తి రూరల్‌ : ఎన్నికల హామీలను అమలు చేసి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడి మాకు న్యాయం చేయండి’.. అంటూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షా ఉద్యోగులు పుట్టపర్తిలో చేపట్టిన సమ్మె మంగళవారం 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ముందుగా గణేష్‌ కూడలిలో మానవహారం ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి బైటాయించారు. దాదాపు గంటపాటు ఎమ్మెల్యే కార్యాలయం ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక సమయంలో ఎమ్మెల్యే కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల వద్దకొచ్చి వారితో మాట్లాడారు. సమస్యలను విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయనద్వారా సీఎంవో కార్యాలయానికి పంపుతామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ఎమ్మెల్యేకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగులు గణేష్‌ కూడలి, యనమలపల్లి సంత మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భిక్షాటన చేశారు. ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ సమగ్రశిక్షా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయసు62 సంవత్సరాలకు పెంచాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ సెలవులు వర్తింపజేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు ఓబుల్‌ రెడ్డి జనరల్‌ సెక్రెటరీ రామన్న, వెంకటరమణ, బాలాజీ, మహేంద్ర, శ్రీనివాసులు, శంకరయ్య, కిష్టప్ప, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్‌ కోనంకి చంద్రశేఖర్‌, ఆదినారాయణ, ఆసిఫ్‌, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

➡️