ఒపిఎస్‌ పునరుద్ధరించే పార్టీకే మద్దతు: యుటిఎఫ్‌

Feb 6,2024 21:44

 పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు, ఉపాధ్యాయులు

                    పెనుకొండ : ఒపిఎస్‌ పునరుద్ధరించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్లను పట్టణంలోని డివైఇఒకార్యాలయం వద్ద యుటీ ఎఫ్‌ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి నరేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్‌ మాట్లాడుతూ పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన పార్టీకే ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని తెలిపారు. ఉద్యోగి జీవితకాలం పనిచేసి,పదవీ విరమణ తరువాత భద్రత కోసం సాధించుకున్న పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి, సిపిఎస్‌, జిపిఎస్‌ అంటూ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఎవరైతే పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తారో వారికే ఉపాధ్యాయులు ఓటు వేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 6 నుండి 15వ తేదీ వరకు పోస్ట్‌ కార్డు ద్వారా ఉద్యమం, 13 నుండి 29వ తేదీ వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మహిళా కమిటీ జిల్లా నాయకురాలు హసీనా బేగం, సీనియర్‌ నాయకులు నారాయణస్వామి, రమేష్‌, రవీంద్రనాథ్‌, ఉపేంద్ర, అశ్వర్థప్ప, లక్ష్మా నాయక్‌, ఆది తదితరులు పాల్గొన్నారు.

➡️