అధికారం శాశ్వతం కాదు : జెసి

మంత్రి సవితతో మాట్లాడుతున్న జెసి.దివాకర్‌రెడ్డి

        పెనుకొండ టౌన్‌ : అధికారం ఎవరికి శాశ్వతం కాదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలని మాజీ ఎంపీ జెసి.దివాకర్‌రెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమ, జౌళీ, చేనేత శాఖల మంత్రి సవితను పెనుకొండ పట్టణంలోని ఆమె నివాసంలో గురువారం కలిశారు. పలు అంశాలపై ఇద్దరు నేతలు కాసేపు చర్చించారు. అనంతరం జెసి విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో రాజమహల్‌ను తలపించేలా పార్టీ కార్యాలయాలు నిర్మించడం జగన్‌కే చెల్లుతుందన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల సొమ్ముతో పార్టీ కార్యాలయాలు నిర్మించడం జగన్మోహన్‌ రెడ్డి నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. సవితకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రధాన్యం ఇచ్చారన్నారు. సవిత రాజకీయాల్లో ఎంతో కష్టపడి పైకొచ్చారని.. ఆమెకు సముచితమైన స్థానం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

➡️