ఇళ్ల వద్దనే పింఛన్లు అందిస్తాం : కలెక్టర్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఇతర అధికారులు

       పుట్టపర్తి అర్బన్‌ : జులై 1న లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్య, డ్వామా పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల పంపిణీకి శనివారం రోజే బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయడానికి చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఇందులో భాగంగా 50 హౌస్‌ హోల్డర్ల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని శుక్రవారం నాటికి ఆ పని పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో వార్డు సచివాలయాలు 544 ఉన్నాయని ఇందులో 4852 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. వారి ద్వారా ఒకటి రెండు రోజుల్లో పింఛను పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అన్ని రకాల పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలూ తీసుకొంటున్నామని కలెక్టర్‌ వివరించారు. అవసరమైతే పోలీసు బందోబస్తు కూడా నిర్వహించడానికి ఎస్‌పి మాధవరెడ్డితో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️