Jun 28,2024 09:16

స్థానిక సంస్థల్లో మార్పులు-చేర్పులు..!

    అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో అధికారం మారింది. వైసిపి ప్రభుత్వం ఘోరంగా ఓటమిని చవిచూసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పటైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లోని పాలకవర్గాల్లో మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. అధికారపార్టీ వైపునకు వలసలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పురపాలక సంఘాల్లో ఎక్కువగా వలసలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీలు వైసిపి చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారిన నేపథ్యంలో మున్సిపాల్టీల ఛైర్మన్‌ కూర్చీ కూడా కదిలేలా కన్పిస్తోంది. మెజార్టీ కౌన్సిలర్లు అధికార టిడిపి కండువా కప్పుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో మున్సిపల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2021లో వైసిపి అధికారంలో ఉన్న సమయంలోనే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్నింటినీ వైసిపి కైవసం చేసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వరకు చూస్తే అనంతపురం నగర పాలక సంస్థతోపాటు మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో తాడిపత్రి ఒక్కటే టిడిపి పాలకవర్గముంది. అన్నీ కూడా వైసిపినే గెలుచుకుంది. ఇప్పుడు వైసిపి తరుపున గెలచిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కౌన్సిలర్లు పార్టీ మారేందుకు సిద్దం అవుతుండడంతో పాలకవర్గాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక్కసారి ఛైర్మన్‌గా ఎన్నికైన వారిని దింపాలంటే అవిశ్వాసం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవిశ్వాసం పెట్టాలంటే నాలుగు సంవత్సరాల కాలం వరకు వీల్లేదన్న నిబంధనలున్నాయి. నేరుగా ఛైర్మన్‌ పార్టీ మారితే పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశముంది. అలా లేకపోతే అవిశ్వాసం పెట్టాలంటే మరో ఏడాది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి మున్సిపల్‌ పాలకవర్గాలు ఏర్పాటై కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అయ్యింది.

మారుతున్న బలాబాలాలు

          మున్సిపాల్టీల్లో బలాబలాలు మారుతున్నాయి. ప్రధానంగా మడకశిర మున్సిపాలిటీలో చూస్తే నలుగురు కౌన్సిలర్లు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక్కడ మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇది వరకు తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందిన వారు ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు చేరిన నలుగురితో కలిపి తెలుగుదేశం బలం తొమ్మిదికి చేరనుంది. ఇక ఎక్స్‌ అఫిసియోగా ఎమ్మెల్యే ఓటు కలిపి పదికి చేరుతుంది. అంటే ఇద్దరి బలం సమానం కానుంది. మరోకరు పార్టీ మారితే మడకశిర మున్సిపాలిటీలో వైసిపి ఛైర్మన్‌ పదవిని కోల్పోనుంది. కదిరిలోనూ ఎన్నికలకు ముందే ఐదుగురు వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. అప్పటికే అక్కడ టిడిపి తరుపున ఆరుగురున్నారు. ఇక్కడ మొత్తం 36 కౌన్సిలరు స్థానాలున్నాయి. ఎమ్మెల్యే ఓటు అదనంగా కలిసొస్తుంది. పాలకవర్గం మారాలంటే మొత్తం 19 మంది బలం ఇక్కడ ఉండాలి. మరికొంత మది కూడా త్వరలో పార్టీ మారే సూచనలున్నట్టు చర్చ నడుస్తోంది. ఇలా జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లోనూ పార్టీల మార్పులు జరుగుతున్నాయి. పాలకవర్గాల మార్పు జరగాలంటే అవిశ్వాసం పెట్టేందుకు సమయం ఏడాది ఉంది. అంతలోపు ఇంకెన్ని మార్పులు జరుగాయన్నది చూడాల్సి ఉంది.

➡️