ఔరా అనిపించే(బా)లా..!

అనంత బాలోత్సవంలో ప్రదర్శనలు చేస్తున్న చిన్నారులు

అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు..!

ఏకపాత్రిభినయంతో అలరించారు..!

పాటలు, డాన్సులతో అలరించారు..!

చూడచక్కని అభినయంతో ఔరా అనిపించారు..!

చిట్టి ప్రయోగాలతో గట్టివారిమని నిరూపించారు… !

బాలోత్సవం వేదికగా చిన్నారులు ‘అనంత’ సందడి చేసి చూపరులను సమ్మోహితులను చేశారు..!

              అనంతపురం కలెక్టరేట్‌ : చిన్నారుల ‘అనంత’ ప్రదర్శనలతో బాలోత్సవం చూపురులను కనువిందు చేస్తోంది. పిల్లల మోములో ఆనందం, తల్లిదండ్రుల కళ్లల్లో చెప్పలేనంత సంతోషంతో బాలోత్సవ ప్రాంగణం కళకళలాడింది. వేలాది మంది ‘అనంత’భావిభారత విజ్ఞాన సంపన్నులు బాలోత్సవ వేదికల మీద సాక్షత్కరిస్తున్నారు. రంగం ఏదైనా ప్రతిభ చాటడమే మా ధ్యేయం అంటూ ముందుకు సాగుతున్నారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం 2వ రోజు జరిగిన అనంత బాలోత్సవాల్లో ఎందరో బాల మేధావులు వారి ప్రతిభను చాటారు. వారి తెలివితేటలను చూసి తమనుతాము మైమరచిపోని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. రెట్టించిన ఉత్సాహంతో చిన్నారులు పట్టపగ్గాల్లేనంత సంతోషంతో సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు అలుపూసెలుపు లేకుండా పోటాపోటీగా ప్రదర్శనలు చేశారు. అడకమిక్‌, కల్చరల్‌ పోటీల్లో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి తెలితేటలతో అందరినీ ఆకట్టుకున్నారు. కల్చరల్‌ పోటీల్లో తమ ప్రదర్శనలతో అందరినీ ఆకర్శించారు. నృత్య ప్రదర్శనలు అందరినీ ఉర్రుతలూగించాయి. నాటిక ప్రదర్శనలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, లఘు నాటికలు క్లాసికల్‌ డాన్స్‌, ఏకపాత్రాభినయం, రైమ్స్‌ అలాపనలు తెలుగు, ఇంగ్లీషు, షార్టు ఫిల్మ్‌ విశ్లేషణలు జరిగాయి. ఇక అకడమిక్‌లో వార్త రచన, మ్యాప్‌, వకృత్వ పోటీలు, క్విజ్‌ తదితర విభాగాల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొని ప్రతిభాను చాటి చెప్పారు. ఉత్సహబరిత వాతావరణంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులు అనేక మంది ఆర్ట్స్‌ కళాశాల మైదానంకు విచ్చేసి ఆసక్తిగా తిలకించారు. బాలోత్సవాల ప్రదర్శన, నిర్వహణ చాలా బాగుంది అంటూ అక్కడికొచ్చిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ప్రోత్సహించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

➡️