కదిరి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో పైసావసూల్‌

Feb 4,2024 22:08

కదిరి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం

                       ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : కదిరి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో లంచాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందన్న విమర్శలు పట్టణంలో బలంగా వినపడుతున్నాయి. కార్యాలయంలో అవినీతి అక్రమాలను అరికట్టే అధికారి గాని ప్రజాప్రతినిధి గాని కనిపించలేదని బాధితులు వాపోతున్నారు. సబ్‌ రిజిస్టార్‌ కనుసన్నల్లో కిందిస్థాయి ఉద్యోగి ద్వారా అవినీతి తారాస్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న అవినీతి బాగోతానికి సంబందించిన విడియోలు రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు గాని, ఉన్నతాధికారులు కాని స్పందించిన దాఖలాలు కన్పించలేదు. కార్యాలయంలో ఏం జరగాలన్నా తన ప్రమేయం ఉండాల్సిందేనని కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగి బాహాటంగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో తాను చెప్పిందే వేదం అని వేలాది రూపాయలు వసూలు చేస్తూ కార్యాలయ అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు పంచాల్సిన బాధ్యత కూడా తనదే అని కొంతమంది వద్ద నగదు తీసుకుంటున్న సమయంలో ఆ ఉద్యోగి చెప్పుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి చూస్తే ఆ ఉద్యోగి వ్యాఖ్యలు నిజమైనట్లే కదా అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కార్యాయంలో జరిగిన లావాదేవీలను ఆడిట్‌ చేసేందుకు వచ్చిన అధికారులు తమ పరిశీలనలో కార్యాలయంలో ప్రభుత్వానికి కొంతవరకు నష్టం కలిగించిన విధంగా పనులు జరగాయని బయట పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై వారు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కేంద్ర బింధువు అయిన ఆ కిందిస్థాయి ఉద్యోగి కొంతమంది వద్ద నోరుజారి చేసిన వ్యాఖ్యలతో కూడిన విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యాలయంలో వస్తున్న అక్రమ సంపాదన స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకే పంచడానికి సరిపోతుందని అయన అన్నట్లు ఉన్న విడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ తతంగం అంతా సంబంధిత జిల్లా అధికారులకు గానీ రాష్ట్రస్థాయి అధికారులకు గానీ తెలియకుండా ఉంటుందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.కదిరి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో లంచవతారం ఎత్తిన కొంతమది సిబ్బంది రిజిస్ట్రేషన్ల ఈసీ, ఆర్‌హెచ్‌ నకలు తదితర సేవల అవసరం కొరకు వచ్చిన వారి నుండి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము తోపాటు లంచం రూపంలో అదనంగా రెండింతలు,మూడింతల సొమ్మును వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ లంచావతారాల వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముడుపులు ముట్టజెప్పిన వారికి నిర్ణీత సమయంలో అన్ని సేవలు అందుతాయని మిగిలిన వారు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగవలసి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కదిరి ప్రజలు కోరుతున్నారు. కదిరి సబ్‌రిజిస్టార్‌ వివరణ : సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలపై సబ్‌రిజిస్టార్‌ అధికారి శిరీషకి ప్రజాశక్తి వివరణ కోరగా ఆమె అస్పష్టమైన సమాధానమిచ్చారు. మందుల కోసం ఇచ్చిన డబ్బులు తీసుకున్నారని అన్నారు. తమ కార్యాలయంలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు.

➡️