క్రీడా ప్రతిభకు ఉజ్వల భవిష్యత్తు : కలెక్టర్‌

Dec 27,2023 22:05

బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

                     కొత్తచెరువు : ప్రతిభగల క్రీడాకారులకు ఉద్యోగ భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్‌ పి. అరుణ్‌ బాబు తెలిపారు. బుధవారం కొత్త చెరువు లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కూడా కాసేపు క్రీడాకారులతో క్రికెట్‌ ఆడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో క్రికెట్‌, వాలీబాల్‌ ,కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ లాంటి ఐదు క్రీడాంశాలలో మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులు సరైన దిశలో ప్రోత్సాహం లేక నిరుత్సాహం చెందకుండా ఆడదాం ఆంధ్ర ద్వారా గుర్తింపు పొందవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో రాణిస్తున్న యువతకు శిక్షణతో పాటు భవిష్యత్తు కాలంలో జట్టులలో కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం తప్పకుండా దక్కుతుందని జిల్లా కలెక్టర్‌ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని మానసిక వికాసం పెంపొందించు కోవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నియోజవర్గ స్థాయి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి వరకు పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌, ఎంపీడీవో బారంసాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️