క్లైముల పరిష్కారంపై పరిష్కారానికి సత్వర చర్యలు : కలెక్టర్‌

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : ఓటరు జాబితాకు సంబంధించి క్లెయిముల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై దినపత్రికల్లో ప్రచురితమైన వార్తంశాలు, వివిధ రాజకీయపక్షాలు తెలియజేసిన అభ్యంతరాలపై సవివరంగా విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై అందిన ఫారం-6, 7, 8 దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై వివిధ రాజకీయపక్షాలతో ప్రతివారం సమీక్షిస్తున్నామని తెలిపారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు వెలువరించిన అభ్యంతరాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం సిబ్బంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ఫామ్‌- 7 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ కొండయ్య, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, ఆర్డీవోలు భాగ్య రేఖ, వంశీకృష్ణ, వెంకటశివరామిరెడ్డి పాల్గొన్నారు.

➡️